Fuel Prices Hike: ప్రజలపై పెట్రో బాంబ్..! త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు? లీటర్ పై ఎంత పెరగొచ్చంటే..
పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
- Naveen
- Updated on- May 11, 2026 / 05:43 PM IST
Fuel Diesel Prices Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? ప్రస్తుతం దీనిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయ పరిణామాలతో పెట్రో వాత ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా.. ఇంధనాన్ని పొదుపుగా వాడాలని స్వయంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునివ్వడం పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు సంకేతాలు ఇచ్చినట్లైంది. గత నాలుగేళ్లుగా దేశంలో పెట్రోల్ ధరలు నియంత్రణలో ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో పెంపు తప్పకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.
70 డాలర్ల నుంచి 126 డాలర్లకు పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధర..
ఇరాన్, యుక్రెయిన్ యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింది. ఇరాన్ యుద్ధ పరిణామాల ప్రభావం నేరుగా భారత్ పై కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల నుంచి 126 డాలర్ల వరకు వెళ్లింది. ప్రస్తుతం 105 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ఏ క్షణంలో అయినా పెరిగే అవకాశం ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు చమురు, బంగారం, రసాయన ఎరువులను మితంగా వాడాలని సూచిస్తున్నారు. దీని ద్వారా భారత విదేశీ మారక నిల్వలను కాపాడొచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
దాదాపుగా నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15లోపు ధరలు పెరగొచ్చన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 15లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు నెలకు దాదాపుగా 30వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. సంక్షోభ సమయంలో ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, చమురు కంపెనీలు పెట్రోల్ పై లీటర్ కు 24 రూపాయలు, డీజిల్ పై 30 రూపాయల వరకు భారాన్ని మోస్తున్నాయి.
ఒక వేళ ధరల పెంపునకు కేంద్రం ఓకే చెబితే పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు దాదాపుగా 4 నుంచి 5 రూపాయలు.. అలాగే వంట గ్యాస్ సిలిండర్లపై 40 నుంచి 50 రూపాయలు పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. సంక్షోభాన్ని నివారించేందుకు యూరప్ దేశాలు సహా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇంధన వినియోగంపై పరిమితి విధించాయి. శ్రీలంక పని దినాలు తగ్గించింది. అయితే, భారత్ లో ఇప్పటివరకు ఇలాంటి సమస్య రాలేదు, ఎలాంటి పరిమితి కూడా లేదు. రానున్న రోజుల్లో పరిస్థితులు చేజారిపోతే ధరల పెంపు ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు గరిష్ట స్తాయికి చేరితే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ఏదో ఒక సమయంలో ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. అయితే, అది ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంపు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రో ధరలు పెరగవని ప్రభుత్వం చెబుతున్నా అంతర్జాతీయ యుద్ధ మేఘాలు, మార్కెట్ ఒడిదొడుకులపైనే తుది ధర ఆధారపడి ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
Also Read: మోదీ బంగారం కొనొద్దు అనడానికి అసలు కారణాలు ఇవన్నమాట.. పెద్ద ప్లానే
