Kolkata Airport : కోల్‌కతాలో తప్పిన భారీ ప్రమాదం.. లేజర్ లైట్ల ఎఫెక్ట్.. గాల్లోనే విమానం చక్కర్లు..!

Kolkata Airport : మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. లేజర్ లైటింగ్ ఎఫెక్ట్ కారణంగా గాల్లోనే కొద్దిసేపు విమానం చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. పూర్తి వివరాలివే

Kolkata Airport

  • మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
  • 159 మందితో వస్తున్న విమానంపై లేజర్ లైటింగ్ ఎఫెక్ట్
  • లేజర్ లైటింగ్ కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, గాల్లోనే చక్కర్లు

Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో అంతరాయం ఏర్పడింది. కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడటంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.

కౌలాలంపూర్ నుంచి 159 మందితో వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH-184 శనివారం రాత్రి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ వర్గాల ప్రకారం.. కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ వల్ల పైలట్ దృష్టి మరలింది.

వాస్తవానికి, శనివారం రాత్రి 11:20 గంటలకు విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ రన్‌వేకు సుమారు 8 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఉన్నప్పుడు మధ్యమ్‌గ్రామ్-బరసాత్ దిశ నుంచి కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడినట్టు పైలట్ గమనించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

చివరికి సేఫ్ ల్యాండింగ్ :
లేజర్ నుంచి ఒక్కసారిగా వచ్చిన కాంతి కారణంగా పైలట్ క్షణకాలం పాటు అయోమయంగా అనిపించింది. దాంతో విమానం అనుకున్న సమయానికి ల్యాండ్ అవ్వలేకపోయింది. మరోసారి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే ముందు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరకు రాత్రి సుమారు 11:25 గంటలకు విమానం సేఫ్ ల్యాండ్ అయింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే..

ఘటనపై పోలీసులకు ఫిర్యాదు :
ఈ ఘటన అనంతరం.. విమానయాన సంస్థ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది. కోల్‌కతా విమానాశ్రయ యంత్రాంగం కూడా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి.

విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకం నిషేధించినట్టు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని, విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

ఈ విషయాన్ని పోలీసు అధికారులకు రిపోర్టు చేశామని, దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లేజర్ లైట్ల వల్ల ఆటంకం కలుగుతోందని పైలట్లు గతంలోనే ఫిర్యాదు చేశారు. 2025లో దుర్గా పూజ సందర్భంగా శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ పూజా పండల్ సమీపంలో లేజర్ లైట్లపై పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత, లేజర్ షోను నిలిపివేశారు.