PM Modi Video : పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ మరో వీడియో.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు!.. రంగంలోకి నీలేకని టీమ్!

PM Narendra Modi : పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

PM Modi Announces Task Force On Exam

PM Modi Video : విద్యార్థుల భవిష్యత్తు, పేపర్ లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా మోదీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఎవరినైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.

పేపర్ లీకేజీలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు మోసాలకు పాల్పడేవారిపై వేగంగా విచారణ జరిపి వారికి శిక్ష పడేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

నిలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ :
‘విద్యార్థుల కష్టాన్ని ఎవరూ దోచుకోలేరు. వారి భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది’ అనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోదీ వెల్లడించారు.

Read Also : Bank Holidays August 2026 : ఆగస్టులో బ్యాంకు పని ఉందా? 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఈ తేదీల్లో వెళ్లొద్దు.. ఫుల్ లిస్ట్!

పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పరీక్షల వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీ ఆధునిక సాంకేతికత, డిజిటల్ విధానాల ఆధారంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి మార్పులకు సూచనలు ఇస్తుంది.

నందన్ నిలేకని ఎవరంటే? :
ప్రముఖ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా ఆధార్ ప్రాజెక్ట్ తొలి ఛైర్మన్‌గా నందన్ నీలేకని దేశంలో డిజిటల్ వ్యవస్థల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆ సంస్థకు సీఈఓగా, ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. అయితే, ఆయన అనుభవంతో పోటీ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

భారత్‌లో ప్రతిష్టాత్మక ఆధార్ ప్రాజెక్టుకు తొలి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో ఆయన బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య (ఆధార్) అందించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2006లో దేశీయ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది.