PM Modi: ఉక్కుపాదం మోపాలి.. ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు..

ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలపై పెట్రో భారం లేకుండా చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

  • Published On : March 27, 2026 / 11:29 PM IST

PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై సీఎంలతో ప్రధాని మోదీ చర్చించారు. ఇంధన భద్రత, రాష్ట్రాల సన్నద్ధతపై సందేహాలకు సమాధానం చెప్పారు. గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

దేశంలో లాక్ డౌన్ ఉండదని సీఎంలకు స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలపై పెట్రో భారం లేకుండా చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. ఎన్నికలు జరిగే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మినహా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులను వర్చువల్ భేటీకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ రెండున్నర గంటల పాటు సాగింది. పశ్చిమాసియాలో సంక్షోభం వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీఎంలతో ప్రధాని మోదీ చర్చించారు. అన్ని రాష్ట్రాలు టీమ్ ఇండియాగా కలిసికట్టుగా పని చేస్తేనే దేశం ఈ పరిస్థితిని విజయవంతంగా అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పౌరుల ప్రయోజనాలను పరిరక్షించాలని, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు ప్రధాని మోదీ.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఒక కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోదీ. యుద్ధం, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాలు, ఇంధన భద్రత, సరఫరాపై ఆందోళనల తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరతను తగ్గించడానికి భారత సన్నద్ధమవుతోంది, దీని అమలులో కేంద్రం, రాష్ట్రాలు రెండూ కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన సహకార సమాఖ్య వ్యూహాన్ని గుర్తుచేస్తూ, ప్రధాని మోదీ “టీమ్ ఇండియా” విధానాన్ని నొక్కి చెప్పారు. స్థిరత్వం కోసం ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలో సమన్వయం ఉండేలా చూడటమే దీని లక్ష్యం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకాలేదు.

”సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. షిప్పింగ్, నిత్యవసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై ముఖ్యమంత్రులు దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి” అని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు ప్రధాని మోదీ.

Also Read: దేశంలో మరోసారి లాక్‌డౌన్ అంటూ వార్తలు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం