Exit Poll Results 2026: బెంగాల్ లో బీజేపీ, కేరళంలో యూడీఎఫ్ దే అధికారం..! ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్

ఎన్డీయే గెలుస్తుందని ఆపరేషన్ చాణక్య, చాణక్య స్ట్రాటజీస్, ప్రజా పోల్, మ్యాట్రిజ్, ప్రీమారక్, టుడేస్ చాణక్య, పోల్ డైరీ, టైమ్ నౌ లాంటి మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి.

  • Updated on- April 29, 2026 / 11:30 PM IST

 

Exit Poll Results 2026: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. పలు సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పోల్ సర్వేలు వేర్వేరుగా ఉన్నాయి.

బెంగాల్ లో కమల వికాసం..!

294 స్థానాలు ఉన్న వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, జన్ మత్ సర్వే సంస్థలు అంచనా వేశాయి. కాగా, ఎన్డీయే గెలుస్తుందని ఆపరేషన్ చాణక్య, చాణక్య స్ట్రాటజీస్, ప్రజా పోల్, మ్యాట్రిజ్, ప్రీమారక్, టుడేస్ చాణక్య, పోల్ డైరీ, టైమ్ నౌ లాంటి మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. చాణక్య స్ట్రాటజీస్ టీఎంసీకి 130 నుంచి 140.. బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వేలో టీఎంసీకి 170 నుంచి 190 స్థానాలు, బీజేపీకి 120 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్ పల్స్ సర్వే టీఎంసీకి 177 నుంచి 187, బీజేపీకి 102 నుంచి 113 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

తమిళనాడులో మళ్లీ డీఎంకేకే పట్టం..!

234 సీట్లు ఉన్న తమిళనాడులో డీఎంకేకి అనుకూలంగా ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, న్యూస్ 18, ప్రజా పోల్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్ వంటి సర్వే సంస్థలు అంచనాలు వెల్లడించాయి. బెంచ్ మార్క్, జేవీసీ లాంటి సంస్థలు అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి పట్టం కట్టాయి. టీవీకే 10 నుంచి 20 సీట్లు దక్కించుకుంటుందని పలు సర్వేలు వెల్లడించాయి.

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకేవైపే మెజార్టీ సర్వేలు మొగ్గు చూపాయి. డీఎంకేకి 145 నుంచి 160 సీట్లు, అన్నాడీఎంకేకి 50 నుంచి 65 సీట్లు, విజయ్ టీవీకే పార్టీకి 13 నుంచి 18 సీట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ లెక్కకట్టింది. ఆత్మ సాక్షి మాత్రం డీఎంకేకి 134 నుంచి 141 సీట్లు, అన్నాడీఎంకేకి 84 నుంచి 90 సీట్లు, టీవీకేకి 4 నుంచి 8 సీట్లే వస్తాయంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే డీఎంకే వైపే మొగ్గు చూపింది. డీఎంకేకి 125 నుంచి 145 సీట్లు, అన్నాడీఎంకే బీజేపీ కూటమికి 65 నుంచి 80, టీవీకేకి 18-24 సీట్లు వస్తాయంటోంది.

కేరళంలో ఈసారి అధికార మార్పు..!

140 సీట్లు ఉన్న కేరళలో ఈసారి అధికారం మారబోతోందని అంచనాలు వేశాయి పోల్ సర్వేలు. ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, పీ మార్క్ బెంచ్ మార్క్ ఇలా చాలా సర్వేలు యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టాయి. రెండో స్థానంలో ఎల్డీఎఫ్ నిలిచే అవకాశం ఉందంటున్నాయి సర్వేలు.

140 సీట్లలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కి 58 నుంచి 64, యూడీఎఫ్ కి 72 నుంచి 80, బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయంటోంది చాణక్య స్ట్రాటజీస్. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎల్డీఎఫ్ కి 61 నుంచి 66, యూడీఎఫ్ కి 76 నుంచి 81 సీట్లు వస్తాయంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే అంచనాల్లో యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు, ఎల్డీఎఫ్ కు 55 నుంచి 65 స్థానాలు వస్తాయని తేలింది.

అస్సాంలో మళ్లీ బీజేపీదే అధికారం..!

126 సీట్లు ఉన్న అస్సాంలో అధికారం మళ్లీ ఎన్డీయేదేనని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, ఎన్డీటీవీ, బెంచ్ మార్క్, యాక్సిస్ మై ఇండియా, జేవీసీ లాంటి సర్వే సంస్థలు ఏకపక్షంగా ఎన్డీయే వైపు అంచనాలు ప్రకటించాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు రెండో స్థానంలో నిలిచాయి.

126 సీట్లలో ఎన్డీయే 85 నుంచి 98, కాంగ్రెస్ 22 నుంచి 32 స్థానాలు గెలుచుకుంటుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. ఆత్మసాక్షి కూడా ఎన్డీయేకి 84 నుంచి 90 స్థానాలు వస్తాయని, 40 నుంచి 46 స్థానాలు కాంగ్రెస్, మిత్ర పక్షాలకు రావొచ్చంటోంది. పీపుల్స్ పల్స్ కూడా ఎన్డీయేకే జై కొట్టింది. 68 నుంచి 72 స్థానాలు ఎన్డీయే కూటమికి, 22 నుంచి 26 స్థానాలు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు వస్తాయని అంచనా వేసింది.

పుదుచ్చేరిలో ఎన్డీయే వైపు మొగ్గు..!

30 సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే వైపు పీపుల్స్ పల్స్, చాణక్య, ప్రజాపోల్, బెంచ్ మార్క్ లాంటి సర్వేలు మొగ్గుచూపాయి. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే 17 నుంచి 20 స్థానాలు, 9 నుంచి 13 కాంగ్రెస్ కూటమికి వస్తాయంటోంది. ఆత్మసాక్షి సర్వేలో 17 నుంచి 19 ఎన్డీయే కూటమికి, 11 నుంచి 12 కాంగ్రెస్ కూటమికి వచ్చే చాన్స్ ఉంది. పీపుల్స్ పల్స్ 16 నుంచి 19 సీట్లు ఎన్డీయే కూటమికి, 10 నుంచి 12 సీట్లు కాంగ్రెస్ కూటమికి వస్తాయని అంచనా కట్టింది.

Also Read: ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. ఇకపై ఇంట్లోనే మీ PF కేవైసీ ఈజీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!