Prajwal Revanna : జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్..

Prajwal Revanna :హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహారంలోని జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. అధికారులకు జైల్లో ఆయన అడ్డంగా దొరికిపోయాడు.

Prajwal Revanna

Prajwal Revanna : ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహారంలోని జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. అధికారులకు జైల్లో ఆయన అడ్డంగా దొరికిపోయాడు. మంగళవారం కేంద్ర నేర విభాగం (సీసీబీ) అధికారులు నిర్వహించిన సోదాల్లో రేవణ్ణ బ్యాకర్ నుంచి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ ధృవీకరించారు.

Also Read : Idli Sambar : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ.. ఇక నుంచి ఇండ్లీ, సాంబార్

హై సెక్యూరిటీ జైలులో ఉన్న ప్రముఖ ఖైదీలు, ఇతర ఖైదీల బ్యారక్ లలో సీసీబీ అధికారులు సుమారు నాలుగు నుంచి ఐదు గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్ గుర్తించారు. ఆయన వద్ద పెన్ డ్రైవ్ కూడా లభ్యమైంది. దీంతో ఎలక్ట్రానిక్ పరికరాలు జైలు లోపలికి ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీనియర్ జైలు అధికారిని సస్పెండ్ చేశారు. భద్రతా లోపాలపై వివరణ కోరుతూ జైలు సూపరింటెండెంట్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

హై సెక్యూరిటీ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వద్ద మొబైల్ ఫోన్ లభించడం జైలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఫోన్ జైలులోకి ఎలా వచ్చింది? దాన్ని ఎవరు అందించారు? దీనికి సిబ్బంది సహకారం ఉందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో వెలువడే వివరాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ మనవడు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో హాసన సెక్స్ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేసింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. సిట్ అధికారుల ఎదుట ఆమె వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఆ తరువాత పలువురు మహిళలు కూడా రేవణ్ణపై ఆరోపణలు చేశారు. విచారణలో దోషిగా తేలడంతో కోర్టు యవజ్జీవ శిక్ష విధించింది.