Prateek Yadav : ఒక మాజీ సీఎం కొడుకు, మరో మాజీ సీఎంకి సవతి తమ్ముడు.. భార్యతో విబేధాలు.. సడన్‌గా మృతి
Prateek Yadav : ప్రతీక్ యాదవ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన కొడుకు. లండన్‌లో చదువుకున్న ప్రతీక్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ దూరంగానే ఉంటూ వచ్చారు. ప్రతీక్ యాదవ్ పెళ్లి బీజేపీ నేత అపర్ణ యాదవ్ తో జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే, దంపతులు ఇద్దరి మధ్య ఎప్పుడూ విబేధాలు ఉన్నట్టు బహిరంగంగానే ప్రచారంలో ఉంది.
- Harish Thanniru
- Published on- May 13, 2026 / 11:32 AM IST
Prateek Yadav
- ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మృతి
- కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది
- ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు.. అప్పటికే మృతి
- ప్రతీక్, ఆయన భార్య మధ్య విభేదాలు
Prateek Yadav : ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కి వరుసకు సోదరుడు అయ్యే ప్రతీక్ యాదవ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా అందరికీ పరిచయం ఉన్న ప్రతీక్ యాదవ్ సడన్‌గా చనిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంతో పాటు రాజకీయవర్గాల్లో కూడా సంచలనంగా మారింది. మరోవైపు అతని భార్య, బీజేపీ నేత అయిన అపర్ణా యాదవ్‌తో ఆయనకు విబేధాలు కూడా ఉండడంతో ఈ మరణంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ప్రతీక్ కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. లంగ్స్‌లో రక్తం గడ్డకట్టుకుపోవడంతో దానికి చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు ఉదయం నిద్రలేపినప్పుడు స్పందించకపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఎవరీ ప్రతీక్ యాదవ్?
ప్రతీక్ యాదవ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన కొడుకు. సాధనకు 1987లో చంద్ర ప్రకాష్ గుప్తా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి ప్రతీక్ గుప్తా పుట్టాడు. ఆ తర్వాత ఆమె 1990లో చంద్రప్రకాష్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య 2003లో చనిపోయారు. ఆ తర్వాత ములాయం సింగ్.. సాధనను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా ఆయన ప్రతీక్ గుప్తా కాస్తా ప్రతీక్ యాదవ్‌గా మారిపోయారు.
రాజకీయాలకు దూరంగా ప్రతీక్..
లండన్‌లో చదువుకున్న ప్రతీక్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ దూరంగానే ఉంటూ వచ్చారు. తన కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఎప్పుడూ వినియోగించుకున్నట్టు ఆరోపణలు లేవు. కానీ, 2017లో 5 కోట్ల విలువైన లోంబార్గినీ కారు కొన్నప్పుడు మాత్రం విమర్శలు వచ్చాయి. అయితే, తాను దాన్ని ఈఎంఐలో కొన్నానని, అన్ని బిల్స్ ఉన్నాయని ప్రకటించారు.
బీజేపీ లీడర్‌తో పెళ్లి.. విబేధాలు..
ప్రతీక్ యాదవ్ పెళ్లి బీజేపీ నేత అపర్ణ యాదవ్ తో జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే, దంపతులు ఇద్దరి మధ్య ఎప్పుడూ విబేధాలు ఉన్నట్టు బహిరంగంగానే ప్రచారంలో ఉంది. స్వయంగా ప్రతీక్ యాదవ్ సోషల్ మీడియాలోనే తాను అపర్ణకు విడాకులు ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, తర్వాత మళ్లీ ఇద్దరూ కలసిపోయారు. ఈ మధ్యకాలంలో కూడా ఈ ఏడాది జనవరిలో వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. కానీ, మళ్లీ కలిసిపోయారు.
