నవసమాజ నిర్మాణం గాంధీ మార్గంతోనే సాధ్యం : మోడీ  

  • Publish Date - October 2, 2019 / 03:50 AM IST

దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ పూజ్య బాపూజీ 150వ జయంతి వేడుకలు అంగర వైభోగంగా జరుగుతున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..గాంధీజీ చూపిన మార్గంలోనే నవ సమాజం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.  సత్యం, అహింసలే  ఆయుధాలుగా చేసుకుని రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పూజ్య బాపూజీ ప్రతీ ఒక్కరికి ఆదర్శమని అన్నారు. భారత స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చేసిన త్యాగాలను..కీలక ఘట్టాలను మోడీ గుర్తు చేసుకున్నారు. 

మానవాళికి మహాత్ముడు చేసిన సేవలకు ఈ సందర్భంగా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ కలలు కన్న భారతాన్ని సాధించటానికి కృషి చేస్తామన్నారు. ఆయన ఆశాలను సాధించే దిశగా కృషి చేస్తామని మోడీ అన్నారు.

అక్టోబర్ 2 గాంధీజీ జయంతి..భారత దేశపు రెండవ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో విజయ్‌ఘాట్ వద్ద లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. లాల్ బహదూర్ శాస్త్రికి..గాంధీజికి సంబంధించిన కొన్ని ఫోటోలను..వీడియోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. గాంధీజీ జయంతి.. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆ మహానుభావులకు నివాళులర్పించారు.

జాతిపితకు నివాళులర్పించిన వారిలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు.