Punjab Prisons Begin Conjugal Visits For Inmates With Good Conduct (1)
Punjab Prisons : జైలు అంటేనే బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని జీవితం. అటువంటి జైలులో నేరస్థులు బంధువులకు దూరంగా జీవితం వెళ్లదీస్తుంటారు. ఎప్పుడో ఓసారి ఆత్మీయులు వచ్చి చూస్తే తప్ప జైలు సిబ్బంది ముఖాలు తప్ప నా అనేవారే కనిపించవు. జైలులో శిక్ష అనుభవించే ఖైదీలకు పంజాబ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఏకంగా జైలులోనే భార్యలతో ఏకాంతంగా గడపటానికి అనుమతి ఇచ్చింది. ఇది అలాంటిలాంటి ఆఫర్ కాదు. ఏకంగా జైలులోనే కాపురం చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ చట్టం ప్రకారం ఇకపై ఖైదీలు జైళ్లలోనే తమ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీలు తమ జీవిత భాగస్వామి కొన్ని గంటలపాటు ఏకాంతంగా గడిపేందుకు అవకాశం ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్ జైళ్ల శాఖ మంగళవారం (సెప్టెంబర్ 20,2022) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్ లోనే ఖైదీల కోసం ఇటువంటి అవకాశాన్ని కల్పించిన రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది.
కానీ ఈ కార్యక్రమానికి కొన్ని షరతులు కూడా విధించింది. ఈ అవకాశం జైలులో ఉన్న ఖైదీలు అందరికీ కాదు. కేవలం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ప్రతి మూడునెలలకు ఒకసారి తమ భార్యలను ఏకాంతంగా కలుసుకోవచ్చు. సుదీర్ఘ కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి మొదట అవకాశం కల్పిస్తారు. దీనికోసం జైలులో అటాచ్డ్ బాత్రూమ్‌తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేసింది జైళ్లశాఖ. రెండు గంటలపాటు వీరిని ఏకాంతంగా ఉండనిస్తారు. కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి మాత్రం ఈ సదుపాయాన్ని కల్పించరు.
మొదటిగా ఈ విధానాన్ని గోయింద్వాల్ సాహిబ్‌లో ఉన్న కేంద్ర కరాగారం, నభాలోని నూతన జిల్లా జైలుతోపాటు భఠిండాలోని మహిళా జైళ్లలో అమలు చేస్తున్నామని పంజాబ్ జైళ్లశాఖ వెల్లడించింది. జైలులో ఉన్న తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలి అనుకునేవారు మ్యారేజ్ సర్టిఫికెట్‌తో పాటు కోవిడ్, లైంగిక సంబంధ రోగాలు, ఇతర అంటువ్యాధులు లేవని వైద్యుడి నుంచి ధ్రవీకరణ పత్రం తీసుకుని రావల్సి ఉంటుంది. మొత్తం మీద ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మరి. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న..అత్యంత సంచలనాత్మక నిర్ణయం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.