Rajasthan Farmer: రూ.5 లక్షలు భూమిలో పాతిపెట్టాడు.. మర్చిపోయాడు.. తీరా కొన్నాళ్ల తరువాత చూస్తే షాక్..
Rajasthan Farmer: రాజస్థాన్‌లోని మంగిలాల్ అనే రైతు రూ.5 లక్షల డబ్బు ఎవరికీ తెలియకుండా ఒక సంచిలో వేసి తన పొలంలోనే ఎక్కడో ఒకచోట భూమిలో పాతిపెట్టాడు.
- V Santhosh Kumar
- Updated on- August 11, 2026 / 12:36 PM IST
Rajasthan farmer buried 5 lakh rupees in farmland termite damaged notes
- భూమిలో పాతిపెట్టిన ఐదు లక్షలు
- చెదలు తిన్న కరెన్సీ నోట్లు
- బ్యాంకు అధికారులను ఆశ్రయించిన రైతు
Rajasthan: భారతీయ గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది రైతులు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకోవడానికి బదులుగా విచిత్రమైన పద్ధతుల్లో భద్రపరచాలని ప్రయత్నిస్తుంటారు. కాలం మారుతున్నప్పటికీ, భద్రత పేరుతో ఇళ్లలోనో, నేల మాళిగల్లోనో లేదా పొలాల్లోనో నగదు దాచిపెట్టే అలవాటు కొందరిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, అలా దాచిన సొమ్మును సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోవడం వల్ల కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో వెలుగుచూసిన ఒక విచిత్రమైన సంఘటన ఇదే కోవకు చెందుతుంది. భూమిని విక్రయించి వచ్చిన సొమ్మును సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో పొలంలో పాతిపెట్టిన ఒక రైతుకు, చివరికి అది కాస్తా కన్నీళ్లను మిగిల్చిన వైనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read – Ap Govt: పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాలుకు రూ.1,000 అదనపు సాయం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
చెదపురుగుల బారిన నోట్లు:
రాజస్థాన్‌లోని నెవాయి గ్రామానికి చెందిన మంగిలాల్ అనే రైతు ఏడాది క్రితం తన భూమిని రూ.5 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బు ఎవరికీ తెలియకుండా ఒక సంచిలో వేసి తన పొలంలోనే ఎక్కడో ఒకచోట భూమిలో పాతిపెట్టాడు. అయితే కొద్ది కాలం తర్వాత ఆ డబ్బు ఎక్కడ దాచాడో పూర్తిగా మరచిపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. చివరకు కుటుంబ సభ్యుల సహాయంతో సుమారు ఆరు ఎకరాల పొలంలో పలుచోట్లు వెతికినా ఎలాంటి ఫలితం లేకపోయింది. సరిగ్గా శుక్రవారం రోజున పొలం దున్నుతున్న సమయంలో ఆ డబ్బుల సంచి అనుకోకుండా బయటపడింది. ఎంతో ఆశగా సంచి తెరిచి చూసిన కుటుంబ సభ్యులకు పెను షాక్ తగిలింది. భూమిలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల చెదపురుగులు ఆ నోట్ల కట్టలను తినేయడంతో అవి పూర్తిగా పాడైపోయాయి.
బ్యాంకు మెట్లెక్కిన బాధితుడు:
చెదపురుగులు తిని దెబ్బతిన్న నోట్లను తీసుకుని ఆ కుటుంబం తీవ్ర నిరాశతో స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖను ఆశ్రయించింది. బ్యాంకు అధికారులు ఆ నోట్లను పరిశీలించగా, వాటిపై ఉన్న సీరియల్ నంబర్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ తరహా దెబ్బతిన్న కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి సాధారణ నిబంధనల ప్రకారం స్థానిక బ్రాంచ్‌లో అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే నేరుగా జైపూర్‌లోని ప్రధాన శాఖను సంప్రదించాలని బాధితుడికి సలహా ఇస్తూ వెనక్కి పంపారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు చేతికి అందివచ్చినట్టే అందినా, అది కాస్తా చెదపాలై నిరుపయోగం కావడంతో ఆ రైతు కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది.
