Food Safety New Guidelines : ఇదేందిది.. నేనెక్కడా చూడలా.. పెళ్లిళ్లకు కొత్త రూల్స్.. భోజనాల్లో ఏం పెడతారో గవర్నమెంట్ ఆఫీసర్లకి చెప్పాలట..
Rajasthan Government : వివాహాలు, మతపరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకల సమయంలో నిర్వాహకులు కార్యక్రమానికి ముందే ఫుడ్ సేఫ్టీ విభాగానికి పూర్తి వివరాలు అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
- Harish Thanniru
- Updated on- August 8, 2026 / 01:27 PM IST
Rajasthan Food Safety New Guidelines
Rajasthan Food Safety New Guidelines : రాజస్థాన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వివాహ వేడుకలు నిర్వహించే వారు ఇకపై విందు ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, ఏదైనా ఫంక్షన్లు జరిగే సమయంలో అక్కడ వడ్డించే ఆహారం, ఇతర పదార్థాలు నాణ్యత, భద్రతకు సంబంధించి జైపూర్ ఫుడ్‌సేప్టీ విభాగం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Also Read : Varuna Yagam : మహా వరుణయాగంలో ‘కరీరీ ఇష్టి’ అంటే ఏమిటో తెలుసా? యాగంలో ఉపయోగించే మూలికలు ఇవే..
పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు, సామూహిక సమావేశాలలో వడ్డించే ఆహార నాణ్యతను నిర్ధారించడానికి, అలాగే ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ కలిగిన లేదా రిజిస్ట్రేషన్ ఉన్న స్వీట్స్ తయారీదారులు, క్యాటరింగ్ నిర్వాహకులు, ఆహార సేవా ప్రధాతలు మాత్రమే వంటకాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార కల్తీని సమర్థవంతంగా అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఏవైనా కార్యక్రమాల (వివాహాలు, మతపరమైన వేడుకలు, ఇతర ఫంక్షన్లు మొదలైనవి) నిర్వాహకులు ఇకపై కార్యక్రమానికి ముందు ఆహార భద్రతా విభాగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. కార్యక్రమంకు సంబంధించిన తేదీ, సమయం, ప్రదేశం, నిర్వాహకుడి పేరు, మొబైల్ నెంబర్, వంటవాడు లేదంటే క్యాటరింగ్ పేరు వారి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు నెంబర్ తోపాటు.. కార్యక్రమానికి వచ్చే వారి అంచనా సంఖ్య, ఆహార తయారీ, వడ్డించేందుకు చేసిన ఏర్పాటకు సంబంధించిన వివరాలను అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అయితే, క్యాటరింగ్ నిర్వాహకులు, స్వీట్ తయారీ వ్యాపారులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనలు ఆచరణ సాధ్యం కావని.. ఈ విధానాల వల్ల చిన్న వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.
