Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని సినీ పరిశ్రమల్లోనూ తీవ్ర విషాదం నింపింది. పునీత్ రాజ్ కుమార్ మరణంతో అభిమానులు, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారు ఇంకా షాక్ లోనే ఉన్నారు. 46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ స్టార్ పునీత్ ఇక లేడనే వార్తను ఇంకా నమ్మలేకపోతున్నారు. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మరణించారు. 46 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది.
పునీత్ రాజ్ కుమార్ మృతికి అసలు కారణం ఏంటి? వర్కౌట్లు, వ్యాయామంపై ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా, పునీత్ రాజ్ కుమార్ గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. పునీత్ కు వర్కౌట్లు, ఎక్సర్ సైజ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు పునీత్ వర్కవుట్లు చాలా ప్రమాదకరంగా ఉండేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా, 40 ఏళ్లు దాటాక జిమ్ విషయంలో డాక్టర్ల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
IRCTC అకౌంట్ పాస్వర్డ్ మరిచిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫిట్‌నెస్‌కు మారుపేరు. నటనను ఎంతగా ఇష్టపడతారో జిమ్ లో వర్కవుట్స్‌ను అంతకన్నా ఎక్కువగా ఇష్టపడుతారు. ఫిట్ నెస్ కోసం ప్రాణం పెట్టి మరీ వర్కవుట్స్ చేస్తారు. వర్కౌట్ చేయపోతే ఆ రోజు వృథా అయినట్టే అనేది పునీత్ అభిప్రాయం.
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే పునీత్ రాజ్‌కుమార్ ప్రతిరోజూ కొత్త కొత్త స్టంట్స్ చేసేవారు. పుష్-అప్ చేసే సమయంలో త్వరగా నేలను తాకడం పునీత్ ప్రత్యేకత. స్పోర్ట్స్ మెన్స్ చేసే కష్టమైన వర్కవుట్స్ ను సైతం పునీత్ సులభంగా చేసేవారు. లాక్డౌన్ సమయంలోనూ ఎక్కువ సమయం ఫిట్‌నెస్‌కే కేటాయించారు పునీత్ రాజ్‌కుమార్. కిల్లర్ బ్యాక్‌ఫ్లిప్ చేసి అందరినీ అబ్బురపరిచారు. షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు వర్కవుట్స్ లో నిమగ్నమయ్యేవారు పునీత్ కుమార్. పవర్ స్టార్ అంటే సినిమాల్లో మాత్రమే కాదు.. ఫిజికల్‌గా కూడా ఫిట్ నెస్‌గా ఉండాలని చెప్పేవారు పునీత్.
కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మూడో కుమారుడే పునీత్ రాజ్ కుమార్. పునీత్ అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్. సినిమాల్లోకి వచ్చాక పునీత్ గా పేరు మార్చుకున్నారు. బాలనటుడిగా దాదాపు 14 సినిమాల్లో నటించారు. పునీత్ పుడుతూనే స్టార్. ఎదుగుతున్న క్రమంలో తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ చాలా కష్టపడ్డారు. ఆయన జీవితం క్రమశిక్షణతో సాగింది.
కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలే చేశారు పునీత్. ఈ క్రమంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో 29 సినిమాలు చేశారు పునీత్ రాజ్‌కుమార్. చివరగా యువరత్న సినిమాలో నటించారు. కన్నడ చిత్ర సీమలో ఏ హీరోకి లేని ఘనత కూడా పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. ఆయన చిత్రాలన్ని కన్నడలో సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి.
సినిమాలు, టీవీ షోలే కాదు.. అనేక సామాజిక కార్యక్రమాల్లో తన దాతృత్వన్ని చాటుకున్నారు పునీత్. తన తల్లి పార్వతమ్మతో కలిసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎంతోమంది పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి ఇక లేడు అనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.