రిపబ్లిక్ డే రోజు..ప్రధానికి ఊహించని గిఫ్ట్ పంపిన కాంగ్రెస్
- venkaiahnaidu
- Published on- January 26, 2020 / 03:00 PM IST
రిపబ్లిడ్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించింది. అమెజాన్ ద్వారా ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో పంపిన 170 రూపాయల విలువగల వస్తువును మరేదో కాదు…భారత రాజ్యాంగ పుస‍్తకం.
ఈ రాజ్యాంగ ప్రతిని మోడీకి పంపి.. దేశాన్ని విభజించే ముందు రాజ్యాంగాన్ని ఓ సారి చదువుకోండి అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం,ప్రతిపాదిత ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఆందోళనలకు కొనాసాగుతున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మతం ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ కనీస పాఠాన్ని కూడా బీజేపీ నేర్చుకోలేకపోయిందని, కాబట్టే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తోపాటు యావత్ దేశం ఆందోళనలను చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ సమయంలో ప్రధాని మోడీకి రాజ్యాంగ ప్రతిని గిఫ్ట్‌గా పంపింది.
గౌరవనీయులైన ప్రధాని గారు.. దేశాన్ని విభజించే పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు.. అయితే ఏకొంచెం టైమ్ దొరికినా ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.. ఇది మన భారత రాజ్యాంగం.. మన వ్యవస్థలన్నీ పనిచేసేది దీనిపైనే’ అంటూ కాంగ్రెస్ ట్విట్ చేసింది. ఫొటోలతోపాటు కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రాజ్యాంగ పీఠిక చదువుతోన్న వీడియోలను కూడా పార్టీ ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. మరి ప్రధాని కార్యాలయం ఈ గిఫ్ట్‌ను స్వీకరించిందా లేక తిప్పి పంపిందా అనేది తెలియాల్సి ఉంది.
