School Girl Kidnapped, Gang Raped In UP: స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు దారుణం

నేరాలకు కేరాఫ్ గా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో అమానుష ఘటన జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కొందరు నీచులు దారుణానికి ఒడిగట్టారు. తమ మాట వినడం లేదని అమ్మాయిని కిడ్నాప్ చేసి..

School Girl Kidnapped, Gang Raped In UP: నేరాలకు కేరాఫ్ గా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో అమానుష ఘటన జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కొందరు నీచులు దారుణానికి ఒడిగట్టారు. తమ మాట వినడం లేదని అమ్మాయిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

బారాబంకి జిల్లా జైద్ పూర్ గ్రామంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న అమ్మాయిని (16) అపహరించిన నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఓ వ్యక్తిని అడ్డుకునేందుకే ఆ నీచులు అతడి కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బుధవారం(మార్చి 17,2021) జరిగిన ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచాయతీ ఎన్నికల కారణంగానే ఈ దారుణం జరిగిందని అతడు వాపోయాడు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని అతడు నిర్ణయించాడు. అయితే ఇది అతడి ప్రత్యర్థులకు ఇష్టం లేదు. పోటీ నుంచి విరమించుకోవాలని ప్రత్యర్థులు చెప్పారు. అయినా అతడు వినలేదు.

ఈ క్రమంలో ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు తొలుత పలుమార్లు ప్రత్యర్థులు తనపై ఒత్తిళ్లు తెచ్చారని, డబ్బు ఆశ కూడా చూపారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో తెలిపాడు. వీటన్నింటినీ నిరాకరించడంతో స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న తన కూతురిని ప్రత్యర్థులు (ఆకాశ్‌ వర్మ, లాల్‌జీ వర్మ, సచిన్‌ వర్మ, శివమ్‌ వర్మ) కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.