సెక్షన్ 17ఏ అంటే ఏమిటి.. ఈ సెక్షన్ ఎవరెవరికి వర్తిస్తుంది?
సెక్షన్-17 కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ర్ట ప్రభుత్వంలో కానీ పనిచేసే అధికారులకు, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 16, 2024 / 01:42 PM IST
Section 17A of the new Prevention of Corruption details
Section 17A : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పు వెలువరించింది. సెక్షన్ 17ఏ కు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అసలు సెక్షన్ 17ఏ అంటే ఏమిటి…? ఈ సెక్షన్ ఎవరెవరికి వర్తిస్తుంది…? ఈ సెక్షన్ కింద విధివిధానాలు ఎలా ఉంటాయి.. ఒక్కసారి చూద్దాం.
2003 నుంచి 2014 మధ్య జరిగిన అవినీతి కేసుల్లో సీనియర్ ఉన్నతాధికారులను సీబీఐ విచారణ పరిధి నుంచి తప్పిస్తూ 2014లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులను ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే విచారణ చేసే అధికారం సీబీఐకి వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ 2018 జూలైలో అవినీతి నిరోధక చట్టం-1988కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణలో భాగంగా ఈ చట్టంలో ‘సెక్షన్ 17 ఏ’ ను చేర్చింది కేంద్రం. విధులు నిర్వర్తించే సమయంలో లేదా నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన అవకతవకలపై పబ్లిక్ సర్వెంట్స్‌ను విచారించే విషయంలో ఈ సెక్షన్‌లో పలు విధివిధానాలను పొందుపరిచారు.
ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్య నిర్వహణలో పాలు పంచుకునే ప్రజా ప్రతినిధులు అనగా ముఖ్యమంత్రి, మంత్రులు పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం కిందకు వస్తారు. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్.. తన విధుల్లో భాగంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగినట్టు ఆరోపణలు వచ్చినా.. అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చినా ఏ పోలీసు అధికారి కూడా సదరు పబ్లిక్ సర్వెంట్‌ను తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతులు లేకుండా విచారించడానికి వీలు లేదు.
Also Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు.. సీజేఐకు బదిలీ
సెక్షన్-17 కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ర్ట ప్రభుత్వంలో కానీ పనిచేసే అధికారులకు, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది. అయితే విధుల్లో భాగంగా లంచాలు తీసుకుంటున్నట్టు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడినా.. లేదా లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు ఈ సెక్షన్ వర్తించదు.
Also Read: మరింత ముదిరిన మాల్దీవ్స్ వివాదం.. భారత్ మాల్దీవుల మధ్య పెరుగుతున్న అగాథం
పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారిపై అవినీతి ఆరోపణలతో విచారణ జరపాలంటే సదరు అధికారి పై అధికారి అనుమతి తప్పనిసరి. అదే విధంగా పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రజా ప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులను తొలగించే అధికారం ఉన్న గవర్నర్ అనుమతి తప్పనిసరి.
