Delhi : షాకింగ్ వీడియో.. మహిళా పైలట్, ఆమె భర్తను దారుణంగా కొట్టిన జనం
నన్ను కొట్టొద్దు, వదిలేయండి, నన్ను క్షమించండి అని ఆమె ప్రాథేయపడినా బాలిక బంధువులు వదిలిపెట్టలేదు. చాలాసేపు ఆమెను కొడుతూనే ఉన్నారు. (Delhi)
- Naveen
- Updated on- July 19, 2023 / 10:02 PM IST
Delhi Pilot Beaten(Photo : Google)
Pilot Beaten : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పైలట్ ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. ఇంట్లో నుంచి రోడ్డు మీదకు ఈడ్చుకుని వచ్చి మరీ పిచ్చకొట్టుడు కొట్టారు. ఆమె జుట్టు పట్టుకుని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని ద్వారకలో బుధవారం మహిళా పైలట్, ఆమె భర్తపై దాడి జరిగింది. దీనికి కారణం పైలట్ దంపతులు పదేళ్ల బాలికను ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవడమే. బాలికను పని మనిషిగా పెట్టుకుని చిత్ర హింసలకు గురి చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. కోపంతో రగిలిపోయిన బాలిక బంధువులు.. మహిళా పైలట్ తో పాటు ఆమె భర్తను దారుణంగా కొట్టారు.
దెబ్బలు తిన్న మహిళ పైలట్ గా పని చేస్తుంది. ఆమె భర్త కూడా ఎయిర్ లైన్ లో పని చేస్తాడు. పైలట్ దంపతులు తమ ఇంట్లో పదేళ్ల బాలికను పని మనిషిగా పెట్టుకున్నారు. అయితే, దొంగతనం చేసిందనే అనుమానంతో బాలికను చిత్ర హింసలు పెట్టారు. బాగా కొట్టారు. బాలిక చేతిపై కాలిన గాయాలున్నాయి. అలాగే కళ్ల కింద కూడా గాయాలున్నాయి. బాలిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆమె దుస్థితిని చూసి కుటుంబసభ్యులు చలించిపోయారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఇంత దారుణంగా కొడతారా? శరీరాన్ని కాలుస్తారా? అని కోపంతో రగిలిపోయారు.
Delhi Girl (Photo : Google)
వెంటనే కొందరు వ్యక్తులు గుంపుగా మహిళా పైలట్ ఇంటికి వెళ్లారు. వారితో వాగ్వాదానికి దిగారు. మహిళా పైలట్ యూనిఫామ్ లోనే ఉంది. గుంపుగా వచ్చిన జనం వారితో గొడవకు దిగారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఇంత దారుణంగా హింసిస్తారా? అని మండిపడ్డారు. ఇరువురి మధ్య వివాదం పెరిగింది. ఇంతలో కొందరు మహిళలు మహిళా పైలట్ ను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ఆ తర్వాత అంతా రౌండప్ చేసి కొట్టడం ప్రారంభించారు. వారిని అడ్డుకునేందుకు పైలట్ భర్త ప్రయత్నించాడు.
దాంతో అక్కడే ఉన్న మగవాళ్లు అతడికి కూడా దేహశుద్ధి చేశారు. దాంతో అతడు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. కాగా, మహిళా పైలట్ ను మహిళలు దారుణంగా కొట్టారు. జట్టు పట్టుకుని చితక్కొట్టారు. నన్ను కొట్టొద్దు, వదిలేయండి, నన్ను క్షమించండి అని ఆమె ప్రాథేయపడినా బాలిక బంధువులు వదిలిపెట్టలేదు. చాలాసేపు ఆమెను కొడుతూనే ఉన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, వారు మా అమ్మాయిని కాల్చివేశారు. తీవ్రంగా కొట్టారు, హింసించారు” అని బాలిక కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళా పైలట్, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఇక చట్ట విరుద్ధంగా మైనర్ బాలికను పనిలో పెట్టిన ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.
పిల్లలను ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవడంపై మన దేశంలో నిషేధం ఉంది. అలా చేయడం చట్టరిత్యా నేరం. అయితే ఈ నియమాన్ని ఇప్పటికీ చాలామంది ఉల్లంఘిస్తున్నారు.
