Ghaziabad Incident: ఆస్తి కోసం గొడవ.. కన్నతండ్రిని కాల్చి చంపేసిన కొడుకు.. ఘజియాబాద్‌లో దారుణం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్(Ghaziabad Incident)లో రూ.150 కోట్ల ఆస్తి కోసం ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా కాల్చి చంపడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
- V Santhosh Kumar
- Published on- July 16, 2026 / 08:30 PM IST
Son shoots and kills his own father over property worth 150 crore in Ghaziabad
- ఆస్తి కోసం కన్నతండ్రి హత్య
- కొడుకు జరిపిన తుపాకీ కాల్పులు
- పరారీలో ఉన్న నిందితుడి గాలింపు
Ghaziabad Incident: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘోర ఘటనే నిదర్శనం. ఆస్తుల కోసం, విలాసాల కోసం కన్నవారినే కాటికి పంపేందుకు వెనుకాడటం లేదు కొందరు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రూ.150 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి కోసం ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా కాల్చి చంపడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది. రక్తం పంచుకు పుట్టిన బంధాల మధ్య మానవత్వం మంటగలిసిపోతోందని ఈ ఘటన నిరూపించింది.
తాగిన మైకంలో తండ్రిపై కాల్పులు:
ఘజియాబాద్(Ghaziabad Incident)లోని మోడీనగర్ పరిధిలో ఉన్న బుధానా గ్రామానికి చెందిన హరి ఓం చౌదరి (52) స్థానికంగా పేరున్న వ్యాపారవేత్త. ఆయనకు ఢిల్లీ-మీరట్ రోడ్డుపై ఉన్న కమర్షియల్ మార్కెట్‌తో పాటు దాదాపు 75 బీఘాల భూమి ఉంది. మొత్తం రూ.150 కోట్ల ఆస్తిని తన పేరిట రాయాలంటూ పెద్ద కుమారుడు, మద్యం అలవాటున్న నిఖిల్ తరచూ తండ్రితో గొడవకు దిగేవాడు. బుధవారం రాత్రి కూడా నిఖిల్ పూటుగా తాగి వచ్చి గొడవపడటంతో వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో నిఖిల్ తన వద్దనున్న అక్రమ పిస్టల్‌తో తండ్రిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, తీవ్ర గాయాలైన హరి ఓం ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు.
గతంలో తమ్ముడిపైనా హత్యాయత్నం:
పోలీసుల దర్యాప్తులో నిందితుడు నిఖిల్ నేర చరిత్ర బయటపడింది. గతంలోనే తండ్రి అతనికి 25 బీఘాల భూమితో పాటు కొన్ని దుకాణాలు రాసిచ్చినప్పటికీ ఆశ చావలేదు. పైగా, 2018 లోనే నిఖిల్ తన సొంత తమ్ముడు నిషుపై కూడా కాల్పులు జరిపి హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. బీబీఏ పూర్తి చేసిన నిఖిల్ ఇంతటి ఘాతుకానికి పాల్పడి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మోడీనగర్ ఏసీపీ భాస్కర్ వర్మ స్పందిస్తూ.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
