Railway Insurance: రైల్వే కౌంటర్ల వద్ద టికెట్ కొంటున్నారా? ఇకపై మీకు కూడా బీమా రక్షణ.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!
రైల్వే కౌంటర్ల వద్ద కొనుగోలు చేసే టికెట్లకు కూడా బీమా(Railway Insurance) సదుపాయం వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- V Santhosh Kumar
- Published on- October 15, 2026 / 10:50 AM IST
Supreme court directs indian railways to provide insurance for counter tickets
Railway Insurance: ఇప్పటివరకు కేవలం ఆన్లైన్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రయాణ బీమా సదుపాయాన్ని ఇకపై రైల్వే స్టేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే సామాన్యులకు కూడా వర్తింపజేయాలని సుప్రీంకోర్టు భారతీయ రైల్వేను ఆదేశించింది. జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రైల్వే భద్రతపై దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది. అక్టోబర్ 27, 2026 నుంచి ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ, ఒకవేళ ఉత్తర్వులను పాటించకపోతే రైల్వే బోర్డునే నేరుగా బాధ్యులను చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Telangana Government: తెలంగాణ రైతులకు కరువు సాయం.. ఎకరానికి రూ. 10 వేలు.. అధికారులతో సీఎం సమీక్ష
పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికులకు ఊరట:
ఆన్లైన్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రజలు నేటికీ ఎక్కువగా రైల్వే రిజర్వేషన్(Railway Insurance) కౌంటర్ల వద్దే టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వీరికి బీమా రక్షణ కల్పించేందుకు అవసరమైన విధానాన్ని రూపొందించాలని రైల్వేకు గతంలోనే తగినంత సమయం ఇచ్చినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే రెండు వారాల్లోగా కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ నిబంధనలతో సమానంగా బీమా వర్తింపజేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ట్రాక్ ఫెన్సింగ్ అలసత్వంపై ఆగ్రహం.. నవంబర్ 16కి విచారణ వాయిదా:
బీమా అంశంతో పాటు రైల్వే భద్రతా ఏర్పాట్లపై కూడా అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతపై ఎన్ని హామీలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదని, ప్రతీ ఏటా రైల్వే ట్రాక్ల ఫెన్సింగ్ లక్ష్యాల్లో మూడో వంతు పూర్తికాకుండా మిగిలిపోవడంపై అధికారులను ప్రశ్నించింది. గత ఏడాది కాలంలో చేపట్టిన పనులపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేసేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జిత్ బెనర్జీ సమయం కోరడంతో, రైల్వే బోర్డు అధికారుల వ్యక్తిగత హాజరును తాత్కాలికంగా వాయిదా వేస్తూ విచారణను నవంబర్ 16కి వాయిదా వేసింది.
