Supreme Court on Housewife : గృహిణి కాదు దేశ నిర్మాత..! సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఇల్లాలి సేవలకు కొత్త నిర్వచనం..

Supreme Court Historic Verdict on House wife : మోటారు ప్రమాదాల్లో గృహిణి మరణిస్తే ఆమె గృహ సంరక్షణ సేవల నష్టాన్ని ప్రత్యేక పరిహారంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహిణుల సేవలకు నెలకు రూ.30 వేల విలువ నిర్ణయిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

Supreme Court Historic Verdict on House wife

  • ఇల్లాలు దేశ నిర్మాత
  • ఆమె సేవలకు నెలకు రూ.30వేల విలువ
  • రోడ్డు ప్రమాద పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Historic Verdict on Housewife : గృహిణుల అపారమైన శ్రమను, కుటుంబం కోసం వారు చేసే త్యాగాలను గుర్తిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గృహిణులు కేవలం ఇంటి పనులు చేసే వ్యక్తులు కాదు.. కటుంబ నిర్మాణంలోనే కాకుండా సమాజ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తారని కోర్టు పేర్కొంది. గృహిణి కుటుంబాన్ని నిర్మిస్తుంది.. కుటుంబం దేశాన్ని నిర్మిస్తుంది.. అందుకే గృహిణి అంటే దేశ నిర్మాత అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: Governor Review: ‘గవర్నర్’ మూవీ రివ్యూ.. 1991లో RBI గవర్నర్ ఏం చేశారు? అప్పుడు ఏం జరిగింది?

2001లో పంజాబ్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం పెంచాలంటూ దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. 2024లో పంజాబ్ – హర్యానా హైకోర్టు సదరు మహిళ భర్త, ముగ్గురు పిల్లలకు కలిపి దాదాపు రూ.8లక్షల పరిహారాన్ని ఖరారు చేసింది. అయితే, తాజాగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్‌కె సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గృహిణుల సామాజిక, ఆర్థిక విలువను తక్కువగా అంచనా వేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఇకపై మోటారు ప్రమాదాల్లో గృహిణులు మరణించినా లేదంటే శాశ్వత వైకల్యానికి గురైనా.. వారి కుటుంబాలు కోల్పోయే గృహ సంరక్షణ నష్టాన్ని ఒక ప్రత్యేక నష్టపరిహార కేటగిరీగా పరిగణించాలని ఆదేశించింది. ఈ సేవల కనీస విలువను నెలకు రూ. 30,000గా నిర్ధారిస్తూ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.. సంపాదించే వారే నిజానికి గృహిణిపై పూర్తిగా ఆధారపడతారు. కానీ, వాస్తవానికి సమాజంలో దక్కాల్సిన గుర్తింపు వారికి దక్కడం లేదు. భవిష్యత్లో ఆమెను ‘గృహిణి’ అనడం కంటే ‘దేశ నిర్మాత’ అని పిలవడమే సముచితమని ధర్మాసనం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని పేర్కొంది. దేశ జీడీపీలో మహిళల ఉచిత సేవల వాటా 15 నుంచి 17 శాతం వరకు ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. రోడ్డు ప్రమాదాల పరిహారం కేసుల్లో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. ఈ కేసులను ఏడాది లోపు పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది.

ప్రజల మానసిక స్థితిలో మార్పు వచ్చేవరకు గర్భధారణ పూర్వ, ప్రసవ పూర్వ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ పీఎన్జీటీ) చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ కేసులో ఓ వైద్యుడి అప్పీల్ ను తిరస్కరించిన కోర్టు.. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో ఆడపిల్లల చదువు, రక్షణ కోసం ఇంకా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడం విచారకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆడపిల్ల పుట్టే హక్కుపై ఎలాంటి ప్రశ్నలు లేని రోజే నిజమైన సమానత్వం సిద్ధిస్తుందని పేర్కొంది.