Stray Dogs : వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు.. ‘రోడ్ల మీద కుక్కలు కనిపిస్తే వదలొద్దు.. అలా చేస్తే కోర్టు ధిక్కరణే’

Stray Dogs : వీధి కుక్కల అంశంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Supreme Court Refuses To Modify Directions To Remove Stray Dogs From Public Places

  • వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
  • గతంలో ఇచ్చిన తీర్పు మార్చే ప్రసక్తే లేదు
  • వీధి కుక్కలను జనావాసాలకు దూరంగా తరలించాల్సిందే

Stray Dogs : వీధి కుక్కల సమస్యతో జనాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఆఖరికి ఈ సమస్య దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. వీధి కుక్కల సమస్యను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు గతంలోనే కఠిన వైఖరి ప్రదర్శించింది. తాజాగా మరోసారి వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్ల మీద తిరిగే వీధి కుక్కలను జనావాసాల నుంచి దూరంగా తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన వివిధ పిటిషన్లపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. వీధి కుక్కల వ్యవహారంలో తమ వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఇదే సమయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దాఖలు చేసిన అన్ని దరఖాస్తులను కోర్టు కొట్టివేసింది.

కుక్కకాట్ల ఘటనలను తీవ్ర సమస్యలుగా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. కుక్కకాట్లను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించింది. కుక్కకాట్లను విస్మరించలేం.. జనావాసాల నుంచి వీధి కుక్కలను తరలించి వాటిని తిరిగి ఆ ప్రాంతాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

గతంలో ఏం చెప్పిందంటే..

వీధి కుక్కల సమస్యపై గతేడాది (2025) ఆగస్టులో జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన బెంచ్ ఢిల్లీ – ఎన్‌సీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై తిరిగే వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్స, టీకాలు వేసిన తర్వాత మళ్లీ రోడ్లపైకి వదలకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ చర్యలను అడ్డుకునే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది.

* వీధి కుక్కలు కాటేస్తే, ఒక్కో పంటి గాటుకు రూ.10వేలు పరిహారం ఇవ్వాల్సిందే : హైకోర్టు ఆదేశం

కోర్టు తీర్పును జంతు ప్రేమికులు వ్యతిరేకించారు. వాటిని వేరే చోటికి తరలించడం వల్ల అవి గందరగోళానికి గురై.. మరిన్ని దాడులకు పాల్పడతాయని వాదించారు. అయితే, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం.. వీరి వాదనతో విభేదించింది. బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలు తిరగడాన్ని “ఆందోళనకరం”గా వర్ణించింది. వీధి కుక్కలు జనాలపై ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేసిన సంఘటనలను తాము విస్మరించలేమని స్పష్టం చేసిన ధర్మాసనం.. జంతు ప్రేమికుల పిటిషన్లను కొట్టేసింది.

* భయానకం.. యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ని కరిచి చంపిన వీధి కుక్కలు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

వీధి కుక్కల సమస్యపై గత ఏడాది 2025లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, నేషనల్ హైవే అథారిటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఆట స్థలాల వంటి పబ్లిక్ ఏరియాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని సూచించింది. విద్యా, ఆరోగ్య సంస్థల చుట్టూ కుక్కలు లోపలికి రాకుండా ప్రహరీ గోడలు నిర్మించాలని, పట్టుకున్న కుక్కలను మళ్లీ అక్కడ వదలకూడదని స్పష్టం చేసింది. అమాయక పిల్లలపై జరుగుతున్న దాడులు, రేబీస్ కేసులను చూసి ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది. కోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకపై ఆదేశాలు పాటించని రాష్ట్రాలపై.. ‘కోర్టు ధిక్కార’ చర్యలు తప్పవు అని సుప్రీంకోర్టు హెచ్చరించింది.