Supreme Court: వారికి ఉద్యోగాలు ఇస్తే అర్హులకు అన్యాయమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఉద్యోగ విద్యార్హతలపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీమ్ కోర్ట్(Supreme Court).
- V Santhosh Kumar
- Published on- June 4, 2026 / 06:59 PM IST
supreme court says that public employment must be given to eligible candidates as per prescribed qualifications
- ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగానికి అన్యాయం
- విద్యార్హతలు దాచిపెడితే ఉద్యోగం ఊడటం ఖాయం
- తక్కువ చదివిన సామాన్యుల కోసమే పోస్టులు
Supreme Court: నిర్ణీత విద్యార్హతల కంటే ఎక్కువ చదువుకున్న అభ్యర్థులను ఆయా ఉద్యోగాల్లోకి అనుమతించడం వల్ల, వాస్తవంగా ఆ పోస్టులకు అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఒక బ్యాంకు అటెండెంట్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, నిబంధనల ఉల్లంఘనలను సహించేది లేదని తేల్చిచెప్పింది.
ఈ కేసులో సదరు ఉద్యోగి తాను గ్రాడ్యుయేట్ (డిగ్రీ) పూర్తి చేసిన నిజాన్ని దాచిపెట్టి, కేవలం పదో తరగతి అర్హతగా ఉన్న అటెండెంట్ పోస్టును దక్కించుకున్నాడు. ఈ మోసాన్ని గమనించకుండా హైకోర్టు అతనికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు(Supreme Court) తప్పుపట్టింది. విద్యార్హతలను దాచిపెట్టి తక్కువ స్థాయి పోస్టుల్లో చేరిన ఉద్యోగిని తొలగిస్తూ సదరు బ్యాంకు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సమర్థనీయమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉద్యోగ నియామకాల్లో విద్యార్హతలకు గరిష్ట పరిమితి విధించడం వెనుక బలమైన, న్యాయమైన సామాజిక కారణాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. విభిన్న పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదవలేకపోయిన అట్టడుగు వర్గాల వారికి ఉపాధి కల్పించడమే ఈ పరిమితుల ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారితో పోటీ పడే అవకాశం లేని సామాన్యుల కోసమే ప్రభుత్వం కొన్ని పోస్టులను ప్రత్యేకంగా కేటాయిస్తుందని, ఈ విధానాన్ని కోర్టులు ఎల్లప్పుడూ గౌరవిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
