Supreme Court: పెళ్లికి ముందు శారీరక సంబంధం కలిగి ఉండటం తప్పు కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు (Supreme Court)చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

supreme court sensational verdict on pre marital sex and character

  • పెళ్లి ముందే సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలనం.
  • తెలంగాణ పోలీస్ బోర్డుకు గట్టి షాక్.
  • నిజాయితీ గల అభ్యర్థికి లభించిన ఉద్యోగం.

Supreme Court: పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు (Supreme Court)చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిసుంటే దానిని ‘నైతిక పతనం’గా భావించలేమని స్పష్టం చేసింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని, కేవలం వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరు మరొకరిని మోసం చేసినట్లు కాదని, దీని ఆధారంగా ఎవరి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Telangana Rains: వర్షాలు వచ్చేశాయ్.. 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఈ కీలక తీర్పుతో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు గట్టి షాక్ తగిలింది. తెలంగాణలోని గజ్వేల్‌కు చెందిన గాజుల తిరుపతి అనే కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపిక రద్దు నిర్ణయాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పూర్తిగా కొట్టేసింది. గతంలో 2014 నాటి ఓ కేసును ఆధారంగా చూపిస్తూ, సదరు అభ్యర్థి ప్రవర్తన (క్యారెక్టర్) బాగాలేదంటూ బోర్డు అతని ఉద్యోగాన్ని నిరాకరించడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది.

అయితే, అభ్యర్థి తిరుపతి తన అప్లికేషన్ ఫామ్‌లోనే ఎంతో నిజాయితీగా ఆ కేసు వివరాలను వెల్లడించడాన్ని న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించింది. తప్పుడు సమాచారం ఇవ్వకుండా వాస్తవాలు దాచని అభ్యర్థికి ఉద్యోగం నిరాకరించడం తగదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాలు నేరం కాదంటూ, బాధితుడికి అనుకూలంగా తీర్పునిస్తూ తక్షణమే అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.