Vijay Fan Slits Throat: విజయ్ ఓడిపోతాడేమో అన్న ఆందోళనతో గొంతు కోసుకున్న అభిమాని..

ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే నమ్ముకోవాలని ప్రశాంతంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • Updated on- May 4, 2026 / 11:52 PM IST

Vijay Fan Slits Throat: తమిళనాడులోని కృష్ణగిరిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. నటుడు, రాజకీయ నాయకుడు, టీవీకే చీఫ్ విజయ్ వీరాభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీని కారణం వదంతులే. ప్రస్తుత ఎన్నికల్లో విజయ్ ఓడిపోయారన్న నిరాధారమైన వదంతులు ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చాయి. ఆ వదంతులు నిజమే అనుకుని కలత చెందిన 28 ఏళ్ల యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి కాసేపటి ముందు ఈ ఘటన జరిగింది.

అయితే, ఇది తప్పుడు సమాచారం, మితిమీరిన అభిమానం వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాన్ని స్పష్టం చేస్తోందని అధికారులు అంటున్నారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కాగా, ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే నమ్ముకోవాలని, ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బాధితుడిని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల కె. మహేంద్రన్‌గా గుర్తించారు. ఇతడు విజయ్ కి వీరాభిమాని. విజయ్ ఓటమి అనే వదంతులతో తీవ్ర మనస్తాపం చెందిన మహేంద్రన్ సోమవారం ఉదయం తన ఇంటి బయట గొంతు కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వారు వెంటనే బాధితుడిని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ఇంటెన్సివ్ చికిత్స అందుతోంది. వాస్తవానికి విజయ్ TVK పార్టీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అద్భుతమైన అరంగేట్రాన్ని నమోదు చేసింది.

తలపతిగా ప్రసిద్ధి చెందిన విజయ్ 2024లో టీవీకేను ప్రారంభించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుండి ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఈ నటుడు-రాజకీయవేత్త దీనిని కేవలం ఎన్నికల పోటీగా కాకుండా ఒక “ప్రజాస్వామ్య పోరాటం”గా అభివర్ణించారు. టీవీకే “ఎవరి కోసమూ లేదా దేని కోసమూ మా రాజకీయాలతో ఎప్పటికీ రాజీపడదు” అని విజయ్ తేల్చి చెప్పారు.

Also Read: టీవీకే మ్యానిఫెస్టో సూపర్ హిట్.. ఎన్నికల మ్యానిఫెస్టోలో విజయ్ ఏమేం హామీలు ఇచ్చారు? ఓటర్లు దేనికి అట్రాక్ట్ అయ్యారు?