Tamil Nadu : కామ్రేడ్ల ఖేల్ ఖతం కాలేదు.. కమ్యూనిస్టులకు ఒకేఒక్క చాన్స్.. అధికారంలోకి వస్తుందా..?
Tamil Nadu : ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీవీఎంకే విజయ్ మధ్య ఫోన్ కాల్ సంభాషణతో టీవీకే- కాంగ్రెస్ కూటమిపై ప్రచారం జోరుగా సాగుతోంది.
- Harish Thanniru
- Updated on- May 5, 2026 / 12:04 PM IST
Vijay TVK party
Tamil Nadu : దేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీల వైభవం ఇక దాదాపు ముగిసినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. గతంలో దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన పశ్చిమబెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభ ఇప్పటికే మసకబారిపోగా.. చివరకు లెఫ్ట్ అధికారంలో ఉన్న మిగిలిన ఒకే ఒక్క రాష్ట్రం కేరళం కూడా చేజారింది. ఆ రాష్ట్రంలో తాజాగా వెల్లడైన ఫలితాల్లో యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇన్నాళ్లు అధికారంలో కొనసాగిన ఎల్డీఎఫ్ పార్టీకి కేవలం 35 స్థానాలు దక్కాయి. దీంతో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు కథ ముగిసిందనే చర్చ జరుగుతోంది. అయితే, దేశంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయింది అనే భావనకు చెక్ పెట్టేందుకు కమ్యూనిస్టులకు ఒకే ఒక్క చాన్స్ మిగిలి ఉంది.
తమిళనాట టీవీకేకు మద్దతిస్తే అధికారికంగా అధికారంలో ఉన్న పార్టీగా కమ్యూనిస్టు పార్టీ గుర్తింపు పొందే అవకాశం ఉంది. తమిళనాడులో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 118సీట్లను సాధించాల్సి ఉంటుంది. విజయ్ టీవీకే పార్టీకి 108 స్థానాలు దక్కాయి. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది.
అయితే, టీవీకే అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాల్సి ఉంటుంది. పీఎంకే పార్టీకి నాలుగు, కాంగ్రెస్ పార్టీకి ఐదు, ఐయూఎఎల్ పార్టీకి రెండు, సీపీఐ పార్టీకి రెండు, సీపీఎం పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. వీటిని కలిపితే విజయ్ బలం 123కు చేరుకుంటుంది. బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
ఇక్కడో మెలిక ఉంది. పీఎంకే పార్టీ ఎన్డీయే భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్, ఐయూఎంఎల్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందా అనేది డౌట్. కాంగ్రెస్, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేతో కలిసేందుకు ముందుకొచ్చినా అప్పుడు సంఖ్యాబలం 119కు చేరుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, పీఎంకే ను కూడా కలుపుకుపోయే ప్రయత్నాల్లో టీవీకే ఉంది. మరోవైపు.. టీవీకే ప్రభుత్వంలో సీపీఐ, సీపీఎం పార్టీలు భాగస్వామిగా చేరితే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రంగా తమిళనాడు మిగిలి ఉంటుంది.
