Mid-Day Meal Scheme : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీ..? ఎప్పటి నుంచి అంటే?
Mid-Day Meal Scheme : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీ అందించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
- Harish Thanniru
- Updated on- July 30, 2026 / 11:38 AM IST
Tamil Nadu Govt Weekly Chicken Biryani in Mid-Day Meal Scheme
Mid-Day Meal Scheme : తమిళనాడులోని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేయనుంది. విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీ వడ్డించే అంశాన్ని టీవీకే ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే దేశంలోనే సుదీర్ఘకాలం నుంచి అమలు చేస్తోన్న పథకంలో ముఖ్యమైన మార్పు అవుతుంది.
Also Read : Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త.. స్వయం ఉపాధి కల్పించేలా..
తమిళనాడు ప్రభుత్వం సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme) కింద విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై మంత్రి రాజ్‌మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకత్వం పాఠశాల పోషకాహార పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ వచ్చిందని చెప్పారు.
కామరాజర్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కళైంజర్ కరుణానిధి గుడ్లను చేర్చారు. ఎంజీఆర్ దాన్ని పోషకాహార భోజన పథకంగా విస్తరించారు. జయలలిత వారంలో అన్ని రోజులూ గుడ్లు అందించేలా చర్యలు తీసుకున్నారు. అదే తరహాలో టీవీకే హయాంలోకూడా ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని కోరుకుంటున్నానని రాజ్‌మోహన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి విజయ్ పరిశీలనలో ఉందని, అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పాఠశాల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాల్లో దేశంలోనే తమిళనాడు రాష్ట్రం ముందంజలో ఉందని, ఈ కొత్త ప్రతిపాదన కూడా ఆ దిశలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకానికి సరఫరాచేసే బియ్యం నాణ్యతను మరింత మెరుగుపర్చే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలిసింది.
తమిళనాడు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా సుమారు 40లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 8వ తరగతి వరకు అమలవుతోన్న సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా మరో 32లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు పథకాలను ఇంటర్ విద్యార్థులకూ విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల మరో 8 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా. అలాగే 2022లో ప్రారంభమైన ముఖ్యమంత్రి అల్పాహార పథకం కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అమలులో ఉంది
