MK Stalin : ‘టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది.. త్వరలోనే మళ్లీ అధికారంలోకి వస్తాం’: MK స్టాలిన్

MK Stalin : తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

tamil nadu MK Stalin Vijay Government and dmk bounce back

  • ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
  • విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది
  • త్వరలోనే డీఎంకే అధికారంలోకి వస్తుంది

MK Stalin : తమిళనాడు ప్రతిపక్ష నేత, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎమ్‌కే) అధినేత ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం “ఎప్పుడైనా కూలిపోవచ్చు” అని, కాబట్టి తమ party (పార్టీ) శ్రేణులు, నేతలు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ డీఎంకే (DMK) శ్రేణులకు పిలుపునిచ్చినట్లు వస్తున్న నివేదికలు సంచలనంగా మారాయి.

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే.. అసెంబ్లీలో కూటమి సమీకరణాలు, మెజారిటీ మార్కు (సీట్ల సంఖ్య) పై రాజకీయ ఉత్కంఠ నెలకొన్న తరుణంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అస్థిరంగా ఉందని, బలహీనమైన మద్దతుపైనే ఆధారపడి నడుస్తోందని డీఎంకే నాయకులు వాదిస్తుండగా.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేశారు. టీవీకే నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం తమ పూర్తి ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటుందని వారు స్పష్టం చేశారు.

*ఆయనతో నన్ను పోల్చకండి- విజయ్ విజయంపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్

ఇదిలా ఉంటే స్టాలిన్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ కేవలం ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి అధికారంలోకి వచ్చిందని, దానికి ఎలాంటి సంస్థాగత నిర్మాణం లేదని విమర్శించారు. ఓడిపోయినందుకు డిఎమ్‌కె శ్రేణులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. మన పార్టీ ఇక్కడే ఉంది. మన ఉద్యమం ఇక్కడే ఉంది. మీరు దేనికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పని చేయండి. మనం తిరిగి వస్తాం అంటూ స్టాలిన్ డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్టాలిన్ మాట్లాడుతూ.. టీవీకే పేరు ప్రస్తావించకుండానే.. వారు పెద్దగా ప్రచారం చేయలేదు.. ఓటర్లను కూడా కలవలేదు. బూత్ ఏజెంట్లను నియమించలేదు… చాలా చోట్ల కౌంటింగ్ ఏజెంట్లను కూడా నియమించలేదు. అలాంటి వారు గెలిచి అధికారంలోకి వచ్చారు. అలాంటిది మన ప్రజా సమస్యలపై ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నాం. మన పార్టీ కూడా త్వరలోనే తిరిగి అధికారంలోకి వస్తుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.

*కరూర్‌ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే విజయ్.

సోషల్ మీడియా ఆధారిత ప్రచారాలను తిప్పికొట్టడానికి డీఎంకే వ్యూహాలను రూపొందించిందని స్టాలిన్ తెలిపారు. అలాగే తమ డీఎంకే ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కొనసాగించాలని కొత్త ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేసినట్లు స్టాలిన్ వెల్లడించారు. ఈ పథకాలు అమలులో ఉన్నంత కాలం తమిళనాడులో ద్రావిడ మోడల్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తాము నిరాశ చెందలేదన్నారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హీట్ పెంచాయి.