Pawan Kalyan – TN CM Vijay: ఆయనతో నన్ను పోల్చకండి- విజయ్ విజయంపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
2019 లో సింగిల్ గా పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారు కదా, ఒక్కొక్కరు పార్టీ నుండి వెళ్లిపోయారు కదా అని గుర్తు చేశారాయన.
Pawan Kalyan – TN CM Vijay: తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ విజయంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమిళనాడులో పరిస్థితులు వేరు ఏపీలో పరిస్థితులు వేరు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్ తో నన్ను పోల్చకండి అని చెప్పారు. సీఎం అయిపోవాలని తాను పార్టీ పెట్టలేదని, సమాజంలో మార్పు తీసుకురావాలనే పార్టీ పెట్టానని పవన్ క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో యాక్టర్ పార్టీ పెట్టి సీఎం అయితే ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు.. ఊరిలో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు వాళ్ల తీరు ఉందని విమర్శలు గుప్పించారు పవన్.
2019 లో సింగిల్ గా పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారు కదా, ఒక్కొక్కరు పార్టీ నుండి వెళ్లిపోయారు కదా అని గుర్తు చేశారాయన. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదులో లక్ష్యాన్ని పూర్తి చేసిన ప్రదాతలు, సాధక్ లతో పవన్ భేటీ అయ్యారు.
12 ఏళ్లుగా పార్టీ నిర్మాణం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు నిర్మాణంపై గట్టిగా దృష్టి పెట్టాం. జీవితాంతం నాతో ఉంటాను అన్న కొందరు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. జన సైనికులు, వీర మహిళలు మాత్రమే నన్ను వదలకుండా బలంగా నిలబడ్డారు. నా పార్టీ అనుకుని భుజాలపై వేసుకుని ఇన్నేళ్లు పార్టీ నడిపింది ఈ సాధక్ లే. ఒక్కడితో ప్రారంభమైన జనసేన నేడు 21.50 లక్షల ఉద్యమి సభ్యత్వాల పార్టీగా ఉంది. కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని పార్టీ పెట్టా. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి కర్ణాటక, మహారాష్ట్ర, కేరళం, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో విస్తరణ చేయమంటున్నారు.
తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం అన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తుంది. ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుండి జనసేన సభ్యత్వాలు ఉండటం ఆనందంగా ఉంది. 21 లక్షల మంది సభ్యులు నమోదవ్వడం మంచి విషయం. దుమ్ము ధూళిలో తిరగడం వల్ల సైనస్ సమస్య పెరిగిపోయింది. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. భుజాల మధ్య టియర్ వచ్చేసింది. ఎన్నికల్లో అభిమానులు లాగెయ్యడం వల్ల కండలు తెగిపోయాయి. నాకు స్పోర్ట్ ట్రైనింగ్ ఉండటం వల్ల బాడీ తట్టుకుంది. నా బాడీకి నొప్పి తట్టుకునే సామర్థ్యం ఎక్కువ. నా కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: టార్గెట్ జెన్జీ.. యువతను అట్రాక్ట్ చేసేలా పవన్ కల్యాణ్ పకడ్బందీ వ్యూహం..
