Tamil Nadu Politics : ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.. ఈ భేటీ వారిని కలిపేందుకేనా? విజయ్‌కు షాకిస్తారా?

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవటంతో అధికారం కోసం టీవీకేతోపాటు డీఎంకే కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Tamil Nadu Politics

  • ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • డీఎంకే, అన్నాడీఎంకేను కలిపేందుకేనంటూ చర్చ

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవటంతో అధికారం కోసం టీవీకేతోపాటు డీఎంకే కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీనే అని డీఎంకే వర్గాలు చెబుతున్నప్పటికీ.. తమిళనాట రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

Also Read : West Bengal : పశ్చిమ బెంగాల్‌లో హైటెన్షన్.. సువేందు అధికారి పీఏపై బుల్లెట్ల వర్షం.. దారుణ హత్య.. టీఎంసీ కీలక ప్రకటన..

ఎన్నికల ఫలితాల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ఒక నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం టీవీకే పార్టీకి 107 స్థానాలుగానే లెక్కించాల్సి ఉంటుంది. విజయ్ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మరో 11 సీట్లు అవసరం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు విజయం సాధించారు. దీంతో వారు విజయ్‌కు మద్దతు పలికినా మరో ఆరుగురు మద్దతు కావాల్సి ఉంది. ఈ నేఫథ్యంలో విజయ్‌తో కలిసొచ్చేది ఎవరు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి తరుణంలోనే ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ కావడం చర్చనీయాంశమైంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎంకే స్టాలిన్‌ను రజనీకాంత్ ఆయన నివాసంలో బుధవారం కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్ స్టాలిన్ తో భేటీ అయ్యారంటూ డీఎంకే వర్గాలు వెల్లడించాయి. అయితే, స్టాలిన్ తో రజనీకాంత్ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు.. తమిళనాడులో బద్దశత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతున్న వేళ స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ కావడంతో ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిగాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని డీఎంకే వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

డీఎంకే కూటమి అభ్యర్థులు 73 చోట్ల విజయం సాధించారు. అయితే, ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు తెలిపింది. దీంతో డీఎంకే కూటమికి ఎమ్మెల్యే సంఖ్య 68గా ఉంది. ఇక అన్నాడీఎంకే కూటమికి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే కూటములు కలిస్తే దాదాపు 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నట్లే.

ఇదిలాఉంటే.. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకేలు దశాబ్దాలుగా బద్ద శత్రువులుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలను కలిపేందుకు రజనీకాంత్ స్టాలిన్‌తో భేటీ అయ్యారనే చర్చ తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అయితే, అలాటిదేమీ లేదని స్టాలిన్‌తో రజనీకాంత్ మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.