CM Vijay Floor Test: తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా.. బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం.. 144 మంది సభ్యుల మద్దతు.. పళనిస్వామి రచ్చరచ్చ
TN Assembly Vijay Floor Test: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విజయ్ ప్రభుత్వానికి 144 మంది సభ్యులు మద్దతు పలికారు.
- Harish Thanniru
- Updated on- May 13, 2026 / 02:18 PM IST
Tamil Nadu Politics Vijay Government Wins Floor Test In Assembly
Vijay Floor Test: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యే సమ్మతిని స్పీకర్ నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వానికి 144 మంది సభ్యులు మద్దతు పలికారు. 22 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. ఐదుగురు (పీఎంకే -4, బీజేపీ-1) తటస్థంగా నిలిచారు. అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే 105, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, ఐయూఎంఎల్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒకరు మద్దతు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే సభ నుంచి వాకౌట్ చేయగా.. విజయ్ ప్రభుత్వానికి అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. కొద్దిసేపటికి మొత్తంగా అన్నాడీఎంకే పార్టీలోని షణ్ముగం నేతృత్వంలోని 25మంది ఎమ్మెల్యేలు బయటి నుంచి మద్దతు ఇచ్చారు. దీంతో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.
ఓటింగ్ ప్రక్రియకు ముందు అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిసామి మాట్లాడుతూ.. విజయ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు ఆయన డబ్బులు ఆఫర్ చేశారని, బల పరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం కలవడం సమంజసం కాదని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలంతా విజయ్ కు వ్యతిరేకంగా ఓటేస్తారని పళని స్వామి తెలిపారు. పళనిసామి వ్యాఖ్యలను అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలు ఖండించారు. తమంతా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని రెబల్ వర్గం నేత వేలుమణి స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. విజయ్ తీరుపై పళనిస్వామి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు.. బలపరీక్ష ఓటింగ్ లో తాము పాల్గొనబోమంటూ డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని ఉదయనిది స్టాలిన్ విమర్శించారు.
ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పార్టీలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉంటుందని, లౌకిక విధానాన్ని అవలంభిస్తూ పాలన సాగిస్తామని చెప్పారు. తమకు అనుకూలంగా ఉన్నవారితోపాటు తమకు వ్యతిరేకంగా ఉన్నవారికి కూడా సమాన పాలన అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. ఓఎస్డీ నియామకంపై వచ్చిన విమర్శలకు విజయ్ స్పందించారు. తమ నిర్ణయంపై మరోసారి పున:సమీక్షిస్తామని విజయ్ తెలిపారు.
