Tamil Nadu : రూ.15వేలు ఇస్తామని మహిళలకు గుండు గీయించిన వ్యక్తి.. చివరిలో బిగ్ ట్విస్ట్..

Tamil Nadu : తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ వింత మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ పథకం అంటూ ఓ వ్యక్తి మహిళలకు గుండు కొట్టించాడు.

Tamil Nadu

  • గుండు గీయించుకుంటే 15వేలు
  • నమ్మి గీయించుకున్న ఇద్దరు మహిళలు
  • చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి

Tamil Nadu : తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ వింత మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ అధికారినని చెప్పిన ఓ ఆకతాయి, కొత్త వైరస్‌ నివారణకోసం గుండు చేయించుకుంటే రూ.15వేల ప్రోత్సాహకం ఇస్తామని మహిళలను నమ్మించాడు. ఆ మాటలను నిజమని విశ్వసించిన కొందరు మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

Also Read : Uttar Pradesh Crime : ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడ్చిన కొడుకు.. దారుణానికి పాల్పడిన తల్లి.. నెలరోజుల తరువాత వెలుగులోకి

తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. తాను అత్తూరు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిగా పరిచయం చేసుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మహిళలకు కరోనా తరహా కొత్త వైరస్‌ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని నమ్మించాడు. విదేశాల్లో ఈ వైరస్ ను అరికట్టేందుకు గుండు చేయించుకునే విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పాడు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తోందని ఆమెను నమ్మించాడు. గుండు చేయించుకుంటే మహిళలకు రూ.15 వేలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్‌టాప్‌, పురుషులకు రూ.6 వేలు అందిస్తామని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పాడు.

ఈ పథకానికి కేవలం 18 మందికే టోకెన్లు వచ్చాయని, పళనియమ్మాళ్ పేరు జాబితాలో మొదట ఉందని కూడా వివరించాడు. ఈ విషయాన్ని పళనియమ్మాళ్ తన చుట్టుపక్కల మహిళలకు చెప్పడంతో వారు నమ్మి వెంటనే బార్బర్ ను పిలిపించుకున్నారు. తొలుత కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం ఆ వ్యక్తికి తిరిగి ఫోన్ చేయగా మొబైల్ స్విచ్‌ఆఫ్ వచ్చింది.

దీంతో అనుమానం వచ్చిన పళనియమ్మాళ్ వెంటనే గుండు కార్యక్రమాన్ని నిలిపివేశారు. అనంతరం తాము మోసపోయామని గ్రహించిన మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలపై అధికారిక వర్గాల నుంచే సమాచారం తెలుసుకోవాలని సూచిస్తున్నారు.