ఉల్లి ఘాటు మామూలుగా లేదుగా : కిలో రూ.180..!!

  • Publish Date - December 5, 2019 / 06:21 AM IST

తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు. 

దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో ఆకాశాన్ని అంటుతూ..రోజుకో రకంగా ఉల్లి రేట్లు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉల్లి కొనలేక..కొనకుండా ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. ఉల్లి ధరల పెరుగుదలపై వ్యాపారి షణ్ముగ ప్రియన్ మాట్లాడుతూ..ఐదు కిలోలు కొనేవారు ఇప్పుడు కేవలం ఒక్క కిలో కొనటంతో సరిపెట్టుకుంటున్నారనీ తెలిపాడు. 

హైదరాబాద్ లో రూ.150
మహారాష్ట్ర నుంచి (పెద్దది) పాత రకం నాణ్యమైన ఉల్లి లారీ హైదరాబాద్ మార్కెట్ కు ఒకే ఒక్క లారీ వచ్చిది. దీంతో మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్‌కు  మహారాష్ట్ర నుంచి 250 క్వింటాళ్ల ఉల్లి రాగా, నాణ్యమైన ఉల్లి ధర కిలో రూ.150 పలికింది రెండో రకం రూ.130, మూడో రకం రూ.90 పలికింది. మహారాష్ట్రదే కొత్తరకం ఉల్లి మొదటి రకం కిలో రూ.110లకు పలకగా, రెండో రకం ధర రూ.90, మూడో రకం ధర రూ.70 పలికింది. ఇదే ప్రాంతానికి చెందిన మూడో రకం ఉల్లి మొదటి రకం ధర 80, రెండో రకం ధర రూ.75, మూడో రకం ధర రూ.50లు పలికింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఉల్లి మొదటి రకం వేలంలో రూ.100లకు కిలో పలికి మహారాష్ట్ర ఉల్లితో పోటీ పడింది. రెండో రకం ఉల్లి ధర రూ. 80, మూడో రకం ధర రూ.60లు పలికింది. మహబూబ్‌నగర్‌ నుంచి 125 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు చేరుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉల్లి మార్కెట్‌కు 1,514 క్వింటాళ్ల ఉల్లి చేరుకుంది. ఇందులో మొదటి రకం ధర కిలో రూ.95 పలకగా, రెండో రకం ధర రూ.80, మూడో రకం ధర రూ.70 పలికింది. రెండు రోజులుగా మార్కెట్‌కు ఆశించిన మేరకు ఉల్లి రావడం లేదని మార్కెటింగ్‌ కమిటీ అధికారులు తెలిపారు. దాంతో ఉల్లి దిగుబడి తగ్గి ధర పెరుగుతుందని అంటున్నారు