Dainik Bhaskar : దైనిక్ భాస్కర్ మీడియా సంస్థపై ఐటీ రైడ్స్, కీలక పత్రాలు స్వాధీనం
ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.
- Naveen
- Updated on- July 22, 2021 / 11:53 AM IST
Dainik Bhaskar Tax Raids
Dainik Bhaskar Tax Raids : ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. దైనిక్ గ్రూప్ భారీ మొత్తంలో ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న ఆఫీసుల్లో సోదాలు సాగుతున్నాయి. దేశంలో ఉన్న దిన పత్రికల్లో దైనిక్ భాస్కర్ గ్రూపు పెద్దది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. చాలా దూకుడుగా ఈ పత్రిక రిపోర్టింగ్ చేసింది. మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను తప్పుపడుతూ లోతైన కథనాలను రాసింది.
ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న దైనిక్ భాస్కర్ గ్రూప్‌కి చెందిన కార్యాలయాలు, యజమాని నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ మీడియా కంపెనీపై ఐటీ దాడులు వార్త చర్చనీయాంశంగా మారింది. దైనిక్ భాస్కర్ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద మీడియా హౌస్ లలో ఒకటి. 5 న్యూస్ పేపర్లు, 65కి పైగా ఎడిషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 6.63కోట్ల మంది రీడర్స్ ఉన్నారు.
