మమత సర్కార్ కు గవర్నర్ తీవ్ర హెచ్చరిక… ఆర్టికల్-154 పరిశీలిస్తా

వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్​ కాంగ్రెస్,గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు. మావోయిస్టుల తిరుగుబాటు పెరిగిందన్నారు. ఉగ్ర మూకలు కూడా రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయి.


పోలీసులు అధికార టీఎంసీ క్యాడర్​గా పని చేస్తున్నారని గవర్నర్ తీవ్ర విమర్శ లు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని, ఆర్టికల్​ 154ను పరిశీలించాల్సి వస్తుందని గవర్నర్ హెచ్చరించారు. తన కార్యాలయాన్ని చాలా కాలంగా విస్మరిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు.


కాగా, 2019, జులైలో గవర్నర్​గా ధన్​ఖర్​ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సీఎం మమతా బెనర్జీతో విభేదాలు తెలెత్తాయి. పలు సందర్భాల్లో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇటీవలే డీజీపీ వీరేంద్రకు లేఖ కూడా రాశారు గవర్నర్ ధన్​ఖర్​. డీజీపీని సెప్టెంబర్​ 26న కలవాలని ఆదేశించారు. అయితే.. డీజీపీకి లేఖరాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. రాజ్యాంగం పరిధిలో నడుచుకోవాలని సూచిస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.