Ozempic Drug: బీ కేర్ ఫుల్..! వెయిట్ లాస్ డ్రగ్ ఒజెంపిక్ వాడకంపై డాక్టర్ల వార్నింగ్.. ఇది అందరి కోసం కాదు..!

ఒజెంపిక్ అందరికీ తగినది కాదని స్పష్టం చేశారు. అంతేకాదు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఉపయోగించాలన్నారు.

Ozempic Drug: బీ కేర్ ఫుల్..! వెయిట్ లాస్ డ్రగ్ ఒజెంపిక్ వాడకంపై డాక్టర్ల వార్నింగ్.. ఇది అందరి కోసం కాదు..!

Updated On : December 13, 2025 / 8:44 PM IST

Ozempic Drug: వెయిట్ లాస్ డ్రగ్ ఒజెంపిక్.. డిసెంబర్ 12న భారత్ లో విడుదలైన సంగతి తెలిసిందే. డయాబెటిస్ (షుగర్), హార్మోన్ థెరపీ, ఒబెసిటీ (అధిక బరువు) వంటి దీర్ఘకాలిక సమస్యల చికిత్సల కోసం ఔషధాలు తయారు చేసే గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నోర్డిస్క్ (డెన్మార్క్) దీన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, యూరప్‌లలో ఈ ఔషధాన్ని బరువు తగ్గడానికి వెగోవీ పేరుతో విక్రయిస్తున్నారు. ఒజెంపిక్ అనేది వారానికి ఒకసారి తీసుకోవాల్సిన ఇంజెక్టబుల్ (ఇంజెక్షన్) ఫార్ములేషన్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బరువు తగ్గించే ఔషధం ఒజెంపిక్ భారత రోగులకూ అందుబాటులోకి వచ్చింది. సెమాగ్లుటైడ్ ఫార్ములేషన్‌తో కూడిన ఈ ఒజెంపిక్‌ ఔషధాన్ని.. అదుపులో లేని టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దల (హెల్తీ డైట్ తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి) చికిత్స కోసం భారత్‌లో ఆమోదించారు. ఇది వారానికి ఒకసారి ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాలి.

ఒజెంపిక్.. సెమాగ్లుటైడ్ బ్రాండ్ పేరు. ఈ ఒజెంపిక్ డ్రగ్ రక్తంలో షుగర్ లెవల్స్‌ నియంత్రణను మెరుగుపరచడంతో పాటు.. ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి, గుండె, మూత్రపిండాల రక్షణకు కూడా తోడ్పడుతుందని నోవో నోర్డిస్క్ తెలిపింది. సెమాగ్లుటైడ్.. క్లోమం (పాన్ క్రియాస్) మరింత ఇన్సులిన్‌ను విడుదల చేసేలా, రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ప్రీ ఫిల్డ్ పెన్ ఉపయోగించి వారానికి ఒకసారి ఇంజెక్షన్‌గా ఒజెంపిక్ ను తీసుకుంటారు.

”ఒజెంపిక్ డ్రగ్.. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడంలో సాయపడుతుంది. మెదడులోని ఆకలిని నియంత్రించే ప్రాంతాలపై పని చేయడం ద్వారా ఆకలిని, ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. దీని ద్వారా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటిస్‌తో సంబంధం ఉన్న గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది” అని డాక్టర్లు వెల్లడించారు.

ఈ ఔషధాన్ని టైప్ 2 డయాబెటిస్ నిర్వహణకు ఇవ్వొచ్చని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో హెల్తీ డైట్ తీసుకుంటూ ఉండాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. ఒజెంపిక్ మూడు డోసేజుల్లో (0.25mg, 0.5 mg, 1mg,) అందుబాటులో ఉంది. నొప్పి లేకుండా ఇంజెక్షన్ కోసం.. నోవోఫైన్ నీడిల్స్ అనే సింగిల్-యూజ్ ప్రీ-ఫిల్డ్ పెన్‌లో అందుబాటులో ఉందని నోవో నార్డిస్క్ తెలిపింది. ప్రతి పెన్నులో వారానికి నాలుగు మోతాదులు ఉంటాయి.

ఓజెంపిక్ చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, కొంతమంది దీనిని ఉపయోగించకూడదని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. ఒజెంపిక్ అందరికీ తగినది కాదని స్పష్టం చేశారు. అంతేకాదు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఉపయోగించాలన్నారు.

వీరికి సెమాగ్లుటైడ్ ఇవ్వకూడదు..

* మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు.
* మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా సిండ్రోమ్ టైప్ 2 ఉన్న వారు (థైరాయిడ్ కణితులకు సంబంధించిన హెచ్చరికను కలిగి ఉంటుంది)
* టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు
* కౌమర దశలో ఉన్న వారు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు.
* సెమాగ్లుటైడ్‌ అంటే అలర్జీ ఉన్న వారు
* గర్భిణిలు, పిల్లలకు పాలు పట్టే మహిళలు.

“ప్యాంక్రియాటైటిస్ చరిత్ర ఉన్న వారు, గ్యాస్ట్రోపరేసిస్ వంటి తీవ్రమైన జీర్ణశయాంతర రుగ్మతలు లేదా ఇప్పటికే ఉన్న డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు లేదా గర్భం దాల్చాలని ప్లాన్ చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఓజెంపిక్ వాడుతూ గర్భం దాల్చాలని ప్లాన్ చేస్తుంటే వారు గర్భధారణకు 2 నెలల ముందు దాన్ని ఆపాలి” అని డాక్టర్లు తెలిపారు.

థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు ఒజెంపిక్‌ను ఎందుకు వాడకూదు?
థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు ఒజెంపిక్‌ను నివారించాలి. ఎందుకంటే థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర కలిగిన మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా (MTC) లేదా బహుళ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2 (MEN 2) ఉన్నవారికి. సెమాగ్లుటైడ్ థైరాయిడ్ సి-కణాలపై GLP-1 గ్రాహకాలను ప్రేరేపిస్తుందని జంతువులపై జరిపిన అధ్యయనాల్లో తేలింది. ఇది ఎలుకలలో కణితులు(ట్యూమర్స్) ఏర్పడటానికి దారితీసింది.

టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారు ఒజెంపిక్‌ను ఎందుకు తీసుకోకూడదు?
ఒజెంపిక్ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి గ్లూకాగాన్‌ను అణిచివేస్తుంది. గ్యాస్ట్రిక్ ఖాళీ చేయడాన్ని నెమ్మదిస్తుంది. టైప్ 1 రోగులు సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయరు. ఎక్స్ టర్నల్ ఇన్సులిన్ మోతాదులతో కలిపినప్పుడు ఇది ప్రమాదాలను పెంచుతుంది.

ఓజెంపిక్.. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA) ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ప్రాణాంతక పరిస్థితి. కచ్చితమైన ఇన్సులిన్ సర్దుబాట్లు లేకపోతే ఇది హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది వికారం వంటి జీర్ణశయాంతర దుష్ప్రభావాలను కూడా పెంచుతుంది.

టైప్ 2 డయాబెటిస్‌ నిర్వహణకు, కొన్ని గుండె సంబంధ ప్రమాదాలను తగ్గించడానికి ఈ ఔషధం చాలా ప్రభావవంతంగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు. అయితే వికారం, వాంతులు, పిత్తాశయ సమస్యలు, లో బ్లడ్ షుగర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే, దీని అర్థం అందరూ దీన్ని వాడకూడదు. వ్యక్తి హెల్త్ ప్రొఫైల్‌ను పూర్తిగా, జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే ఈ డ్రగ్ ని సూచించాలని డాక్టర్లు తేల్చి చెప్పారు.

Also Read: భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?