కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా ఎమ్మెల్యే కొలికపూడి.. ఏం జరుగుతోందంటే?
ఏదైనా ఘాటుగా మాట్లాడటం ఆయన స్టైల్. పైగా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
- సోషల్ మీడియా పోస్టులతో రచ్చ చేస్తున్న ఎమ్మెల్యే
- అధిష్టానం చెప్పినా ఆయన తీరు ఎందుకు మారట్లేదు?
- సహజ శైలినే కొలికపూడిని కాంట్రవర్సీల్లోకి లాగుతోందా?
- కొలికపూడి కొని మరీ సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారా?
Kolikapudi Srinivasa Rao: కొలికపూడి శ్రీనివాసరావు.. అమరావతి రైతుల ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈయన..వైసీపీ హయాంలో అపోజిషన్ వాయిస్‌తో లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచి..వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు.
తరచూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతూ..పార్టీకి, క్యాడర్‌కు తలనొప్పిగా మారారన్న చర్చ జరుగుతోంది. వివాదాలే ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయో లేక ఆయనే కాంట్రవర్సీకి తెరలేపుతున్నారో తెలియదు కానీ..ఎమ్మెల్యే కొలికపూడి తీరు ఎప్పుడూ హాట్ టాపిక్ ఉంటోంది. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించి..అధికారంలోకి వచ్చాక ఆయనే సమస్యగా మారారన్న టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీలో ఉండి..స్వపక్షంలో విపక్షంలా సొంత ఎజెండాతో, తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ తాను చిక్కుల్లో పడటమే కాదు..పార్టీని కూడా ఇరకాటంలో పడేస్తున్నారు.
ఎంపీ కేశినేని చిన్నితో వివాదం..వాట్సప్ స్టేటస్‌లతో రచ్చరచ్చ చేశారు. టీడీపీ పెద్దలు పలుసార్లు ఆయనను పిలిచి మాట్లాడారు. అధిష్టానం సీరియస్ కావడంతో అప్పుడప్పుడు సైలెంట్ అవుతున్నారు. తనకేం తెలియదు..ఏ కాంట్రవర్సీతో ఏ సంబంధం లేదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. సడెన్‌గా మళ్లీ ఏదో ఒక వాట్సప్ పోస్ట్, స్టేటస్‌తో వార్తల్లో నిలుస్తున్నారు కొలికపూడి.
Also Read: మంత్రి అజారుద్దీన్‌ను వెంటాడుతున్న పదవీ గండం.. గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ భారీ వ్యూహం
పరోక్షంగా ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నట్లు వాట్సప్ స్టేటస్ పెట్టిన ఎమ్మెల్యే కొలికపూడి అధిష్టానం నుంచి చీవాట్లు తిన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పల్లె కన్నీరు పెడుతోంది అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు కలకలం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ పాలనను విమర్శించేలా పోస్టులు పెట్టి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు ఎమ్మెల్యే.
తీవ్రస్థాయిలో మందలించినట్లు వార్తలు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు కొలికపూడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మందలించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై సీఎం సీరియస్‌గా ఉన్నారని, ఇకపైనా ఇలాగే వ్యవహరిస్తే ఎమ్మెల్యేగా గుర్తించడం కూడా మానేస్తామంటూ తేల్చి చెప్పారంటూ ప్రచారం జరిగింది. ఇది జరిగిన రెండు రోజులుకు మంత్రి నారా లోకేశ్ శాసనసభ్యులకు ఇచ్చిన విందులో కొలికపూడి కనిపించారు. దీంతో అధిష్టానంతో ఆయనకు సఖ్యత కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
లేటెస్ట్గా కొలికపూడి పెట్టిన పోస్టు మరోసారి చర్చకు దారితీసింది. ఎప్పుడూ విలక్షణంగా పనిచేసే క్రమంలో వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యే కొలికపూడి ఈ సారి అత్యంత జాగ్రత్తగా వాట్సప్ పోస్టు రాశారు. అయితే ఆయన తన వాట్సప్ పోస్టులో వైసీపీ పార్టీ పేరు ప్రస్తావించడం తీవ్ర చర్చకు దారితీసింది.
సీఎం చంద్రబాబు డైరెక్షన్స్ ప్రకారం బడ్జెట్‌పై సలహాలు సూచనల కోసం నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టాలని భావించిన ఎమ్మెల్యే..ఆ సమావేశానికి వైసీపీతో పాటు ఇతర పార్టీలను ఆహ్వానించారు. మిగతా కూటమి ఎమ్మెల్యేలకు భిన్నంగా కొలికపూడి వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిలదీస్తే, తనకు రాజకీయంగా అనుభవం లేదని, ఎలా నడుచుకోవాలో మార్గనిర్దేశం చేయాలని సీనియర్లు తనకు సహకరించాలని కొలికపూడి కోరినట్లు వార్తలు వచ్చాయి.
అందుకే కాంట్రవర్సీలు?
అయితే కొలికపూడి సహజ శైలినే ఆయనను కాంట్రవర్సీల్లోకి లాగుతుందన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనన్న అసంతృప్తి ఒకటి అయితే..తన ఎజెండా ప్రకారం పనిచేసుకుంటూ పోవడమే కొలికపూడిని కాంట్రవర్సీల్లో పడేస్తుందని అంటున్నారు. గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం శిక్షణ, మార్గ దర్శకత్వం అందించిన ఆయన..ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. అమరావతి రైతుల పక్షాన గళమెత్తి నిత్యం టీవీ డిబేట్లలో కూర్చొని పాపులర్ అయిపోయారు.
కానీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఉన్న పాపులారిటీ పోయేలా బిహేవ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..పైగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నప్పుడు సమస్యలపై ఎలా గళమెత్తినా నడుస్తుంది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఏ నెగెటివ్ కామెంట్ చేసినా అది ప్రభుత్వానికి, సీఎంకు బ్యాడ్నేమ్ను తెచ్చి పెడుతుందని అంటున్నారు. అందుకే పబ్లిక్ వాయిస్‌గా సక్సెస్ అయిన కొలికపూడి..పొలిటీషియన్‌గా నిలదొక్కుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది.
ఏదైనా ఘాటుగా మాట్లాడటం ఆయన స్టైల్. పైగా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే లోకేశ్‌తో భేటీ అయి సఖ్యతతో ఉన్నట్లు కనిపించిన కొలికపూడిని..పూర్తిగా దారిలోకి తీసుకురావాలని కోరుతున్నారట తిరువూరు టీడీపీ నేతలు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఔట్‌రైట్‌గా పార్టీ లైన్లోకి వస్తారో.? లేక యథావిధిగా తన స్టైల్‌నే ఫాలో అవుతారో వేచి చూడాలి.
