మంత్రి అజారుద్దీన్‌ను వెంటాడుతున్న పదవీ గండం.. గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ భారీ వ్యూహం
అజారుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టి ఆరు నెలుల పూర్తి అయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో కొత్త ఫార్ములాకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్.
Mohammad Azharuddin
- ఏ సభకూ ఎన్నిక కాకుండానే మంత్రి అయిన అజార్
- మంత్రి పదవి చేపట్టి 4 నెలలు కావొస్తుండటంతో ప్రెజర్
- అజార్‌ను మండలికి పంపేందుకు.. ఎమ్మెల్సీకి రాజ్యసభ ఆఫర్!
Mohammad Azharuddin: అనూహ్యంగా మంత్రి అయిన అజారుద్దీన్‌ను పదవీ గండం వెంటాడుతోంది. గతేడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే మూడున్నర నెలలు గడిచిపోయింది. కానీ అజార్ ఇప్పటివరకు అటు అసెంబ్లీకి కానీ..ఇటు మండలికి కానీ ఎన్నిక కాలేదు. ఆరు నెలల్లోపు ఏదో సభకు ఎన్నిక కాకపోతే ఆయన పదవి ఊస్ట్ అవడం పక్కా.
దీంతో అజారుద్దీన్ విషయంపై కాంగ్రెస్ పెద్దలు పెద్ద కసరత్తే చేస్తున్నారట. అజారుద్దీన్‌ను పదవీ గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఈ దెబ్బతో ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి మార్గం సుగమమం కానున్నట్లు తెలుస్తోంది.
అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా చేసే ఆలోచనలోనే మంత్రివర్గంలోకి తీసుకుంది ప్రభుత్వం. కానీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ వీడటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరి నియామకాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని వారి పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
Also Read: Nara Lokesh: లోకేశ్ ఆత్మీయ విందు వెనుక అసలు ప్లానేంటి..?!
గత ఏడాది ఆగస్ట్ 30న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై చర్చించిన మంత్రిమండలి ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు ఫైల్ పంపింది. అయితే కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై వేసిన కేసులో తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పడంతో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఇంతలోపే అజారుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టి ఆరు నెలుల పూర్తి అయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో కొత్త ఫార్ములాకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్.
ఏప్రిల్ 30 డెడ్‌లైన్
వచ్చే ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్సీగానో లేదా ఎమ్మెల్యేగానో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మంత్రి పదవికి గండం తప్పదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా శాసనసభకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇక ఎమ్మెల్సీగానే ఎన్నిక కావాల్సి ఉంది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని క్యాబినెట్ నిర్ణయించినా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
దీంతో అజారుద్దీన్‌ను పదవీగండం నుంచి గట్టెక్కించేందుకు..రేవంత్ వ్యూహాన్ని రచిస్తున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నవారిలో ఒకరి చేత రాజీనామా చేయించి వారి స్థానంలో అజారుద్దీన్‌కు మండలికి పంపించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేయబోయే నేతకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసే అవకాశం ఉందట. అయితే అజారుద్దీన్ కోసం ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేసే నేత ఎవరో.? రాజ్యసభకు వెళ్లేదెవరో.? వేచి చూడాలి.
