Nara Lokesh: లోకేశ్ ఆత్మీయ విందు వెనుక అసలు ప్లానేంటి..?!
జగన్ ఎప్పుడైనా ఇలా గడిపారా? అనే ఆలోచనను వైసీపీ నేతలు, కార్యకర్తల్లో పుట్టించాలనే వ్యూహం అంటున్నారు. లోకేశ్ కోరుకుంటున్నది కూడా ఇదే.
Nara Lokesh
- ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్గా లోకేశ్ డిన్నర్ మీట్.!
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ వరుస భేటీలు
- ప్రజాప్రతినిధులతో పాటు వారి కుటుంబాలకు దగ్గరయ్యే ప్లాన్
- టీడీపీ ఫ్యూచర్ లీడర్‌గా బాండింగ్ పెంచుకునే వ్యూహం
Nara Lokesh: చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేశే. అన్నీ కలిసి వస్తే సీఎం అయ్యేది కూడా ఆయనే. ఏపీ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఈ విషయంలో క్లియర్ కట్ క్లారిటీ ఉంది. అయితే చంద్రబాబు సీనియారిటీ వేరు. టీడీపీ నేతలు, అభిమానులతో చంద్రబాబుకు ఉన్న బాండింగ్ కూడా సమ్‌థింగ్ స్పెషల్. బాబును తమ ఫ్యామిలీ మెంబర్లా..కుటుంబ పెద్దలా ఫీల్ అవుతుంటారు తెలుగు తమ్ముళ్లు.
లోకేశ్‌ను కూడా తమ పార్టీ భవిష్యత్ నాయకుడని క్యాడర్, లీడర్లు యాక్సెప్ట్ చేసినా..వాళ్లకు చంద్రబాబుతో ఉన్నంతగా లోకేశ్‌తో అనుబంధం ఏర్పడలేదు. ఎందుకంటే లోకేశ్ కొత్తతరం పొలిటీషియన్. వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చిన నేత. అందుకే సరికొత్త స్ట్రాటజీకి తెరలేపారట లోకేశ్. అదే డిన్నర్ మీటింగ్ అస్త్రం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందుకు శ్రీకారం చుట్టారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైమ్‌లో ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అవుతున్నారు. వారితో కలిసి విందు చేసి ముచ్చటిస్తున్నారు. ఆత్మీయ విందుల వెనుక కేవలం కలిసి భోజనం చేయడం..కబుర్లు చెప్పుకోవడమనే కాన్సెప్టు కాదంటున్నారు.
Also Read: టాటా, బైబై, ఖతం.. అవమానకర స్థితిలో ఆస్ట్రేలియా ఔట్.. సూపర్ 8-కు పసికూన జింబాబ్వే
అత్యంత కీలకమైన ఫార్ములా వేరేగా ఉంది. కుటుంబాలకు కూడా పార్టీ తరఫున భరోసా కల్పించాలన్నదే ప్రధాన వ్యూహమంటున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ ఈ తరహా కార్యక్రమం చేయలేదు. చివరకు టీడీపీలోనూ ఎమ్మెల్యేల కుటుంబాలను ఒక వేదికపైకి తెచ్చి నిర్వహించిన కార్యక్రమేమి లేదు. కానీ, తొలిసారి ఇలాంటి ఆలోచన చేశారు లోకేశ్.
టీడీపీలో చంద్రబాబు అంరదికీ సుపరిచితమే. నారా లోకేశ్ కూడా అంతే. అయితే..దీనికి భిన్నంగా మరింత ఆత్మీయంగా టీడీపీ నేతలు, వారి కుటుంబాలతో మమేకం అయితే నారా లోకేశ్‌ను తమ పార్టీ పెద్దగా భావించే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో తమకు కీలక నాయకుడు పరిచయం అయ్యాడన్న సంతృప్తి కూడా ఆయా నేతల కుటుంబాల్లో ఉంటుంది. తాను అందరికీ అందుబాటులో ఉంటున్నానన్న భావన కల్పించాలన్నది కూడా లోకేశ్ ఆలోచనగా చెబుతున్నారు.
అపాయింట్మెంట్ దొరకడం అంత ఈజీ కాదు
సీఎం, మంత్రులతో అపాయింట్మెంట్ దొరకడం అంత ఈజీ కాదు. ఇలాంటి సమయంలో లోకేశ్ స్వయంగా ఎమ్మెల్యేల కుటుంబాలకు ప్రత్యేక విందు ఇచ్చి..వారితో ప్రత్యేకంగా మాట్లాడి భవిష్యత్‌పై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేతలతో కాదు వారి కుటుంబ సభ్యులతో అనుబంధం ఏర్పడితే..భవిష్యత్‌లో రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అ్రగనేతలతో ఉన్న బాండింగ్‌తో వాళ్లను పార్టీలోనే ఉండేలా చేస్తుందని భావిస్తున్నారట.
లోకేశ్ విందు రాజకీయంపై రకరకాల చర్చ జరుగుతోంది. లోకేశ్ డిన్నర్ మీట్ వెనుక, వైఎస్ జగన్‌కు మరింత షాకిచ్చే వ్యూహం ఉందని అంటున్నారు. ప్రజా ప్రతినిధులే కాదు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపాలన్న ఆలోచనకు లోకేశ్ రావడం వెనుక వైసీపీ లీడర్లు, క్యాడర్‌ను అట్రాక్ట్ చేసే ప్లాన్ ఉందంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఎవరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వరని.
సమస్యలు చెప్పుకుందామంటే , కనీసం కలవడానికి కూడా ఆసక్తి చూపరని వైసీపీ ప్రజాప్రతినిధులే పలుసార్లు వాపోయిన సందర్భాలున్నాయి. ఏదైనా ఉంటే ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలని అనేవారని ఎమ్మెల్యేలు ఆవేదనకు గురయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి అలా ఉంటే, ఇక కార్యకర్తలు, సామాన్య జనాన్ని అయితే జగన్ ఇంటి దారిదాపుల్లోకి కూడా రానిచ్చేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి.
ఇలా ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్‌కు, ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ మధ్య గ్యాప్ ఏర్పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అటు లీడర్లు, ఇటు కార్యకర్తల అసంతృప్తే వైసీపీ ఘోర ఓటమికి కారణమైందన్న టాక్ ఉంది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ నడుచుకున్న తీరుతో ఆ పార్టీ నష్టపోయిందని..టీడీపీలో కూడా అలా అసంతృప్తులు, కమ్యూనికేషన్ గ్యాప్లకు ఆస్కారం ఇవ్వొద్దనే లోకేశ్ విందు రాజకీయం షురూ చేశారంటున్నారు.
నెగెటివ్‌గా ఉన్న అంశాన్ని పాజిటివ్‌గా..
రాజకీయ ప్రత్యర్థికి నెగెటివ్‌గా ఉన్న అంశాన్ని తనకు పాజిటివ్‌గా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారట లోకేశ్. కూటమి ప్రజాప్రతినిధులే కాదు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపితే, పబ్లిక్‌లోకి మంచి సంకేతాలు వెళ్తాయని సరికొత్త ఆలోచనకు లోకేశ్ పదును పెట్టారని అంటున్నారు. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులతో విందు సమావేశం నిర్వహిస్తున్నారు.
వారి పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. నాయకుడంటే లోకేశ్‌లా ఉండాలి. జగన్ ఎప్పుడైనా ఇలా గడిపారా? అనే ఆలోచనను వైసీపీ నేతలు, కార్యకర్తల్లో పుట్టించాలనే వ్యూహం అంటున్నారు. లోకేశ్ కోరుకుంటున్నది కూడా ఇదే. ఏ ప్రజాప్రతినిధి అయినా మొదట తమతో అధినాయకుడు మాట్లాడాలని కోరుకుంటారు.
కనీస మాట పలకరింపే తమకిచ్చే గౌరవంగా భావిస్తారు. ఇప్పటికీ వైసీపీలో ఈ ఆత్మీయ పలకరింపు, పర్సనల్ అపాయింట్మెంట్లు లేవని..అంటున్నారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు వారి కుటుంబాలతో డిన్నర్ మీట్ అవుతూ లోకేశ్ కొత్త సాంప్రదాయానికి తెరదీశారని..ఇది ఆయన నాయకత్వానికి మరింత బూస్టప్ ఇవ్వడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
