భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?

భారత్‌పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.

భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?

Updated On : December 13, 2025 / 3:13 PM IST

US House: భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం వరకు సుంకాలు విధించి, అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక, భద్రతా సమస్యలకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ట్రంప్ ఈ సుంకాలు విధించారు. ఈ సుంకాలకు ఇక ముగింపు పలకాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో శుక్రవారం డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

జాతీయ అత్యవసర ప్రకటన కింద తీసుకుంటున్న చర్యల అమలును ఇక ముగించాలనే లక్ష్యంతో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ట్రంప్‌ చర్యలు అక్రమమని, అమెరికా కార్మికులు, వినియోగదారులు, భారత్‌-యూఎస్‌ ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని వారు పేర్కొన్నారు.

బ్రెజిల్‌పై విధించిన సుంకాలను రద్దు చేయాలనే ఉద్దేశంతో సెనేట్‌లో ఇప్పటికే డెమొక్రట్లు, రిపబ్లికన్లు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానంలో ప్రస్తావించారు.

అలాగే, అత్యవసర అధికారాల కింద దిగుమతి సుంకాలను పెంచేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడికి ఉన్న అధికారాలను నియంత్రించాలనే ఉద్దేశం కూడా ఈ తీర్మానంలో కనపడుతోంది.

Also Read: Trump Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాపై చర్చ… అసలు గ్రీన్ కార్డు వల్ల లాభాలేంటి?

భారత్‌పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.

ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) అంటే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించేందుకు వీలుగా ఉన్న యూఎస్ చట్టం.

“అమెరికాలోని ఉత్తర కరోలైనా ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో భారత్‌తో చాలా లోతుగా అనుసంధానమై ఉంది” అని కాంగ్రెస్‌ సభ్యురాలు రాస్ చెప్పారు.

భారత కంపెనీలు రాష్ట్రంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి జీవశాస్త్రం, సాంకేతిక రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించాయని, ఉత్తర కరోలైనా తయారీదారులు ఏటా వందల మిలియన్ డాలర్ల విలువైన సరుకులను భారత్‌కు ఎగుమతి చేస్తున్నారని ఆమె తెలిపారు.

“భారత్ ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి. ఈ అక్రమ సుంకాలు.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఉత్తర టెక్సాస్ ప్రజలపై పన్ను లాంటివి” అని కాంగ్రెస్‌ సభ్యుడు వీసీ అన్నారు.

“ఈ సుంకాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. సరఫరా చైన్‌లకు భంగం కలిగిస్తున్నాయి. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయి. వినియోగదారుల ఖర్చులు పెంచుతున్నాయి” అని ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యుడు కృష్ణమూర్తి చెప్పారు. వీటికి ముగింపు పలికితే యూఎస్-భారత్ ఆర్థిక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆయన వివరించారు.