Dark Night : ‘డార్క్ నైట్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ శుభశ్రీ బోల్డ్ పాత్రలో నటించిన సినిమా..
డార్క్ నైట్ సినిమా నేడు మార్చ్ 13న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. (Dark Night)
Dark Night
Dark Night : పూర్ణ, త్రిగుణ్, విధార్థ్, శుభశ్రీ రాయగురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా డార్క్ నైట్. పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ బ్యానర్ పై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో ఆథిత్యా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డార్క్ నైట్ సినిమా నేడు మార్చ్ 13న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
కథ విషయానికొస్తే..
అలెక్స్ (విధార్థ్) ఒక లాయర్. అతనికి హేమ(పూర్ణ)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈ పెళ్లి ఇంట్లో వాళ్ళు చేసింది. పెళ్లి తర్వాత హేమ ఎంతో అందంగా జీవితం ఊహించుకుంటుంది. కానీ అలెక్స్ తన ఆఫీస్ లో పనిచేసే సోఫియా(సుభాశ్రీ రాయగురు)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సమయంలో హేమ జీవితంలోకి రోషన్(త్రిగుణ్) వస్తాడు. హేమ – రోషన్ దగ్గరవుతారు. సోఫియా వేరే వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకోవడంతో అలెక్స్ ఆమెని చంపాలనుకుంటాడు.
అలెక్స్ సోఫియాని చంపుతాడా? అసలు రోషన్ ఎవరు? ఆమె హేమ జీవితంలోకి ఎందుకు వస్తాడు? రోషన్ గురించి అలెక్స్ కి తెలుస్తుందా? అలెక్స్ – హేమ మళ్ళీ కలుస్తారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Varsham : అసలు ‘వర్షం’ టైటిల్ ప్రభాస్ది కాదు.. ఏ హీరోదో తెలుసా? ఆ సినిమా ఏంటో తెలుసా?
సినిమా విశ్లేషణ..
ఇటీవల సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగి అవి హత్యలు, ఆత్మహత్యలకు దారి తీసి నేరాలుగా మారుతున్నాయి. అలాంటి కథలతో ఒక మెసేజ్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. మొదట అలెక్స్ – హేమ పెళ్లి అయ్యేవరకు సింపుల్ గా సాగుతుంది. అలెక్స్ కి సోఫియాతో బంధం ఉందని హేమకి తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా నడుస్తుంది. మధ్యలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నాయి. కథ అంతా హేమ దృష్టికోణం నుంచి చెప్పే స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నారు. సినిమాని మలుపు తిప్పే ఊహించని ఓ ట్విస్ట్ బాగుంటుంది.
భార్య-భర్తల మధ్య గొడవలు, విడాకులు, ద్రోహం, ప్రేమ, నిరాశ, వివాహేతర సంబంధాలు, వాటి వల్ల జరిగే నేరాలు.. ఇలాంటి కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. చివర్లో భార్య భర్తలు ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే మెసేజ్ ని బాగా చూపించారు. రొమాన్స్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కొన్నిచోట్ల సస్పెన్స్ కథాంశంతో సాగుతుంది. సినిమా నిడివి రెండు గంటలే కావడం కొంత ప్లస్ అయింది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
పూర్ణ చాన్నాళ్లకు భార్య పాత్రలో మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. క్లైమాక్స్ లో తన నటనతో అదరగొట్టింది అని చెప్పొచ్చు. త్రిగుణ్ కూడా తాను ఇప్పటివరకు చేసిన పాత్రలకు డిఫరెంట్ గా కనిపించాడు. పూర్ణ భర్త పాత్రలో విధార్థ్ బాగానే నటించాడు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు మాత్రం తన అందాలను ఆరబోసి కాస్త ఘాటుగానే కనిపించింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Allu Cinemas Inside Photos : కొత్తగా ఓపెన్ అయిన అల్లు సినిమాస్.. లోపల ఎంత బాగుందో చూడండి.. ఫొటోలు..
సాంకేతిక వర్గం..
తమిళ స్టార్ డైరెక్టర్, నటుడు మిస్కిన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం గమనార్హం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. పాటలు మాత్రం యావరేజ్. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా సినిమాలో రాత్రి పూట జరిగే సీన్స్ కి విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను కథగా తీసుకొని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా డార్క్ నైట్ సినిమా సమాజంలో భార్య భర్తల చుట్టూ జరుగుతున్న సంఘటనలతో సస్పెన్స్ ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
