R Sabarinathan: గెలుపు దిశగా విజయ్ డ్రైవర్ కొడుకు.. మళ్లీ వైరల్ గా మారిన పాత వీడియో..

తన కొడుకు శబరినాథన్ రాజకీయాల్లోకి రావాలని తండ్రి అనుకోలేదు. తన కుమారుడు ఇంజనీర్ కావాలని ఆయన కోరుకున్నారు. కొడుకు శబరి కూడా తండ్రి మాట వినడానికి ప్రయత్నించారు.

  • Updated on- May 4, 2026 / 05:18 PM IST

R Sabarinathan: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎవరూ ఊహించని రీతిలో స్థానాలు సంపాదించింది. ఎలాంటి గుర్తింపు లేని, అత్యంత సాధారణ వ్యక్తులకు విజయ్ పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా టికెట్ పొందిన వారిలో ఒకరే శబరినాథన్. ప్రస్తుతం ఆయన లీడ్ లో ఉన్నారు. గెలుపు దిశగా సాగిపోతున్నారు.

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ మాజీ డ్రైవర్ కుమారుడే ఈ ఆర్. శబరినాథన్. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీవీకే అభ్యర్థుల జాబితాలో తన పేరు విన్నాక శబరి బాగా ఎమోషన్ అయిపోయారు. విజయ్ ను గట్టిగా పట్టుకుని స్టేజ్ పైనే కంతటడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ముఖాల్లో ఒకరిగా నిలిచారు ఈ శబరినాథన్.

ఎవరీ ఆర్. శబరినాథన్?

శబరినాథన్. వయసు 30ఏళ్లు. విజయ్ తొలి చిత్రం ‘నాలయ తీర్పు’ నుంచి ఆయన డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న రాజేంద్రన్ కుమారుడే ఈ శబరి. విరుగంబాక్కం నుంచి టీవీకే టికెట్‌పై పోటీ చేశారు. ట్రెండ్స్ ప్రకారం ఆ సెగ్మెంట్‌లో డీఎంకే అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు.

ఆ పాత ఎమోషనల్ వీడియో మళ్లీ వైరల్..

మార్చి చివరలో విజయ్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఆ సమయంలో లిస్ట్ లో తన పేరు ఉందని తెలిసి శబరినాథన్ బాగా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. విజయ్ ఆయన కన్నీళ్లను తుడుస్తూ కౌగిలించుకున్నారు. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది. తన దగ్గర పని చేసే డ్రైవర్ కొడుక్కి విజయ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడం అందరినీ అట్రాక్ట్ చేసింది. తన ప్రధాన బృందం పట్ల విజయ్ విధేయతకు ఇది అద్దం పట్టింది.

శబరినాథన్ తెర వెనుక కథ..

తన కొడుకు శబరినాథన్ రాజకీయాల్లోకి రావాలని తండ్రి అనుకోలేదు. తన కుమారుడు ఇంజనీర్ కావాలని ఆయన కోరుకున్నారు. కొడుకు శబరి కూడా తండ్రి మాట వినడానికి ప్రయత్నించారు. కానీ చివరికి తండ్రికి తెలియకుండా నేరుగా విజయ్‌తో మాట్లాడారు. పార్టీలో చేరడానికి తన తండ్రి ఒప్పించాలని విజయ్ ను కోరారు. ఆ తర్వాత విజయ్ శబరి తండ్రితో మాట్లాడారు. కొడుకు రాజకీయ రంగ ప్రవేశానికి అనుమతించేలా రాజేంద్రన్‌ను ఒప్పించారు. ఈ విషయాన్ని స్వయంగా శబరినాథన్ తెలిపారు.

టీవీకేలో ఎలా చేరారు? విరుగంబాక్కం ఎందుకు ఎంచుకున్నాడు?
కొంత విరామం తర్వాత శబరినాథన్ 2024లో చెన్నైకి తిరిగి వచ్చారు. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణాల ద్వారా ఎదిగిన ఒక సామాన్య కార్యకర్తగా తనను తాను నిలబెట్టుకుంటూ టీవీకేలో లాంఛనంగా చేరినట్లు సమాచారం. రాజేంద్రన్ దశాబ్దాల విధేయతను గౌరవిస్తూ ఆయన కుమారుడిని విరుగంబాక్కం నుండి బరిలోకి దింపారు విజయ్. ఒక డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా విజయ్ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. డబ్బు బలం ఉన్న వారికే ఈ రోజుల్లో పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. అలాంటిది విజయ్ అందుకు భిన్నంగా ఓ కామన్ మ్యాన్ కి టికెట్ ఇవ్వడం నిజంగా హ్యాట్సాఫ్ అంటున్నారు అభిమానులు. దటీజ్ విజయ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Also Read: స్టాలిన్‌ని మట్టికరిపించింది ఈయనే.. విజయ్ వదిలిన బాణం..