TVK Vijay Government : తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి.. హిట్టా.. ఫట్టా? సంచలన నిర్ణయాలివే..

TVK Vijay Government : తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది.

TVK's Vijay government completes 100 days of rule in Tamil Nadu

TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయ్‌కు అధికారం చేపట్టేందుకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్‌సహా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. కాగా.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల పాలనలో విజయ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఏ మేరకు హామీలను అమలు చేశారు.. 100రోజుల విజయ్ పాలన ఎలా ఉందనే విషయాలను పరిశీలిద్దాం..

Also Read : BJP : బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరి, స్మృతి ఇరానీలకు కీలక పదవులు.. బండి సంజయ్, డీకే అరుణకు షాక్..

విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాలో 100వ రోజు విజయానికి సంకేతమైతే.. రాజకీయాల్లో మాత్రం అది పాలనకు తొలి పరీక్ష. అయితే, ఈ వంద రోజుల పాలనలో సీఎం విజయ్ అవినీతి నిర్మూలపై ప్రత్యేక దృష్టిసారించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను టీవీకే సర్కార్ చేపట్టింది. మంచి పాలన అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేయడం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, అధికార వ్యవస్థలో జవాబుదారీతనం, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందడం కూడా కీలకమే.

ముఖ్యమంత్రి విజయ్ అవినీతిని అంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా కేవలం రూ. 1,000 లంచం డిమాండ్ చేసినా, ఆడియో లేదా వీడియో సాక్ష్యాలతో ఫిర్యాదు చేసే పౌరులకు రూ. 1,00,000 నగదు బహుమతి ప్రకటిస్తూ విజయ్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. అవినీతి ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ వేదికలను అందుబాటులోకి తెచ్చారు. అవినీతికి పాల్పడితే మంత్రులైనా, అధికారులైనా ఎలాంటి రెండో అవకాశం ఉండదని, తక్షణమే పదవుల నుంచి తొలగిస్తామని సీఎం విజయ్ హెచ్చరించారు. నిధుల దుర్వినియోగం, రోడ్ల నిర్మాణంలో అవకతవకలపై విజిలెన్స్ అధికారులతో దాడులు నిర్వహించి చర్యలు చేపడుతున్నారు. ఇలా అన్ని విభాగాల్లో అవినీతి, దోపిడీని అరికట్టేందుకు విజయ్ తన వందరోజుల పాలనలో తనవంతు ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీవీకే సర్కార్ విద్యార్థులకు నాణ్యమైన చదువు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపైనా దృష్టిసారించింది. ఇందులో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యంతో వెట్రీ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా 12 లక్షల మంది విద్యార్థులు, లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఆరు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మరో 15.14 14 లక్షల మందికి విస్తరించింది. ఇందుకోసం 710 కోట్ల రూపాయలు కేటాయించింది. కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందించేందుకు కోట్లాది రూపాయలు కేటాయించగా 11వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిల్లు అందిస్తుంది.

రైతు సంక్షేమంపైనా విజయ్ సర్కార్ ప్రత్యేక దృష్టిసారించింది. 6000 కోట్ల రూపాయల పంట రుణ మాఫీని ప్రకటించడంతోపాటు చెరుకుకు టన్నుకు రూ.4000, వరికి క్వింటాకు రూ. 2750 ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అయితే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు టీవీకే సర్కార్ సరియైన న్యాయం చేయలేక పోతుందని విమర్శిస్తున్నాయి.

డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 65 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లను విజయ్ సర్కార్ ఏర్పాటు చేసింది. విద్యా సంస్థలు, ఆలయాలు, బస్ స్టాండ్ల సమీపంలోఉన్న 717 మద్యం దుణాలను మూసివేసినట్లు ప్రకటించింది. టీవీకే సర్కార్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి భారీగా నిధులు కేటాయించింది. మహిళలకు పలు పథకాలను అమలు చేస్తోంది.

పెట్టుబడుల ఆకర్షణలోనూ తమ ప్రభుత్వం ముందంజలో ఉందని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. కేవలం 100 రోజుల్లోనే రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నాయి. దీనివల్ల కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, టీవీకే 100రోజుల పాలనపై పలు వర్గాల నుంచి ప్రశంసలు వర్షం కురుస్తుండగా.. విమర్శలుసైతం వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు ఒకవైపు ఉంటే.. క్షేత్రస్థాయిలో పాలన మరోలా ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ విజయ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను డమ్మీ సీఎం అంటూ విమర్శించారు. సోషల్‌ మీడియా రీల్స్‌ మినహా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వానికి సొంత విధానాలు, కొత్త ఆలోచనలు లేవని విమర్శించారు. మాజీ బీజేపీ నేత అన్నామలై కూడా ప్రభుత్వం తీరుపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు మంత్రులపై కమీషన్ల ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. టెండర్లలో 2 నుంచి 4 శాతం వరకు కమీషన్‌ అడుగుతున్నారంటూ ఆయన ఆరోపించారు.

అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రస్తుతం వంద రోజుల పాలనతో టీవీకే సర్కార్ పాలనపై హిట్టా.. ఫట్టా? అని చెప్పలేమని. ఏడాది పాలన తరువాత ప్రజల్లో వచ్చే సానుకూలత, వ్యతిరేకత ఆధారంగా విజయ్ ఎలా పరిపాలన చేస్తున్నాడానే విషయాన్ని నిర్ధారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.