Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకల గ్రనేడ్‌ దాడి .. యూపీకి చెందిన ఇద్దరు కూలీలు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు చేసిన గ్రనేడ్‌ దాడిలో యూపీకి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకల గ్రనేడ్‌ దాడి .. యూపీకి చెందిన ఇద్దరు కూలీలు మృతి

Two labourers from UP killed in grenade attack in Jammu and Kashmir

Updated On : October 18, 2022 / 12:53 PM IST

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా గ్రనేడ్ లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు వలసకూలీలు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలసకూలీలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్‌ జిల్లాలో మంగళవారం (అక్టోబర్ 18,2022)తెల్లవారుజామున ఈ దారుణానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. షోపియాన్‌లోని హర్మెన్‌ ప్రాంతంలో వలసకూలీలు నివసిస్తున్న ఇంటిపైకి ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్‌, మోనిశ్‌ కుమార్‌గా కశ్మీర్ పోలీసులు గుర్తించారు.

ఘటన తర్వాత హర్మెన్‌ ప్రాంతంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టి ముష్కరుల కోసం గాలించారు. ఈ సోదాల్లో లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్‌ ఉగ్రవాది ఇమ్రాన్‌ బషీర్‌ గనీని పోలీసులు అరెస్టు చేశారు. కూలీలపైకి గ్రనేడ్‌ విసిరింది ఇమ్రానే అని పోలీసులు విచారనలో తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని జమ్మూకశ్మీర్‌ అదనపు డీజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

 

కాగా గత శనివారం షోపియాన్‌ ప్రాంతంలోనే ఓ కశ్మీరీ పండిట్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్‌ గ్రామంలో పూర్ణ కృష్ణ భట్‌ తన పూర్వీకుల నివాసం వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపగా..తీవ్రంగా గాయపడిన భట్‌.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ ప్రకటించింది. భట్‌ హత్యతో కశ్మీర్‌ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. పచ్చగా ఉండే కశ్మీరంలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతు రక్తపుటేరులు ప్రవహించేలా చేస్తున్నారు.