Mumbai : ముంబైలో ‘విరాట్ గర్జన మోర్చా’.. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు భారీ నిరసన
Uddhav Raj Thackeray Mumbai Protest : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ముంబైలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు భారీ నిరసన చేపట్టారు.
- Harish Thanniru
- Updated on- October 4, 2026 / 02:01 PM IST
Uddhav Raj Thackeray Mumbai Protest
Uddhav Raj Thackeray Mumbai Protest : ముంబైలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రేలు కలిసి ‘విరాట్ గర్జన మోర్చా’ పేరుతో భారీ నిరసన చేపట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ ఆందోళన నిర్వహించారు.
Also Read : Gyanesh Kumar : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు బిగ్ షాక్.. 20ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి..
ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణకోసం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, ఓటర్ల హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని వారు ఆరోపిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ ముంబైలోని మెట్రో సినిమా వద్ద ప్రారంభమై బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయం వైపు సాగింది. కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP) నేతలు, కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ ఉద్యమాన్ని కేవలం తమ పార్టీల కార్యక్రమంగా కాకుండా విస్తృత రాజకీయ, ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఇతర పార్టీలను కూడా కలుపుకోవాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు పిలుపునిచ్చారు. మరోవైపు, ఇరు పార్టీల కార్యకర్తలు పార్టీ జెండాలకు బదులుగా జాతీయ జెండాను మాత్రమే పట్టుకుని నిరసనలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియను రద్దు చేయడంతో పాటు ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలన్న డిమాండ్లను కూడా రాజ్ ఠాక్రే ప్రస్తావించారు. ముంబైలో నిర్వహించిన ఈ సంయుక్త నిరసన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం తర్వాత ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికపైకి రావడం కూడా ఈ ఆందోళనకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
