Ebola Virus: బిగ్ రిలీఫ్.. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఆమెకు ఎబోలా నెగిటివ్..

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. జనాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

  • Published on- May 28, 2026 / 12:44 AM IST

Ebola Virus: భారతీయులకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇటీవల ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన మహిళకు ఎబోలా నెగిటివ్ అని వచ్చింది. దాంతో హమ్మయ్య అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎబోలా సోకినట్లు అనుమానంతో ఐసోలేషన్‌లో ఉంచిన బెంగళూరు మహిళకు పరీక్షల్లో నెగటివ్ రావడంతో భారతదేశంలోని ఆరోగ్య అధికారులు రిలాక్స్ అయ్యారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ఆ మహిళను పర్యవేక్షణలో ఉంచారు. ఆమె ఇటీవల ఉగాండా నుంచి ప్రయాణించి వచ్చింది.

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. జనాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఇదే సమయంలో భారత్ ను ఎబోలా వైరస్ భయపెట్టింది. దీనికి కారణం ఉగాండి నుంచి వచ్చిన మహిళే.

ఇటీవల ఒక మహిళ ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చింది. అయితే, ఆమెలో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయి. అసలే ఉగాండా నుంచి వచ్చింది, పైగా ఎబోలా లక్షణాలు కనిపించాయి. అంతే, యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ మహిళను ఐసోలేషన్ లో ఉంచారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారు. ఎబోలా టెస్ట్ చేశారు. తాజాగా ఆమెకు నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రి ధృవీకరించారు.

ఈ నెల 23న ఉగాండా దేశానికి చెందిన మహిళ కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయర్ పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉగాండా నుంచి వచ్చిన మహిళలో ఎబోలాకు సంబంధించి స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దాంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమె శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV)కి పంపించారు. ఫలితాల్లో నెగెటివ్ అని రావడంతో అంతా రిలాక్స్ అయ్యారు.