Union Budget 2026
Union Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ -2026ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పలు రంగాలపై ఆమె వరాల జల్లు కురిపించారు. దీనిని యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించారు. అయితే, ఈ బడ్జెట్‌లో ఏపీకి రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగాన్ని పెంచడంతోపాటు, ఆయా రాష్ట్రాల్లో మైనింగ్ మరియు ప్రాసెసింగ్ సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రత్యేక మిషన్‌ను ప్రభుత్వం చేపట్టనుందని పేర్కొన్నారు.
ఖనిజ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు అవసరమైన ప్రోత్సాహకాలు, విధాన పరమైన మద్దతు అందిస్తూ పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
‘రేర్ ఎర్త్స్ కారిడార్ పథకం 2025 నవంబర్ నెలలో ప్రారంభించబడింది. ఇప్పుడు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలలో మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన అరుదైన భూమి మూలకాల కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నామని’ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025 నవంబర్ నెలలో కేంద్ర మంత్రివర్గం సుమారు 7వేల కోట్ల వ్యయంతో అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల తయారీని ప్రోత్సహించే పథకానికి ఆమోదం తెలిపింది.
అరుదైన భూమి కారిడార్లు అంటే ఏమిటి?
అరుదైన భూమి కారిడార్లు (Rare Earth Corridors) అనేవి అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాలలో ఉపయోగించే ఖజనాల సమూహం. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాలు, ఇతర అధునాతన ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల (Rare Earth Elements – REE) తవ్వకం, ప్రాసెసింగ్ మరియు పరిశోధన కోసం అభివృద్ధి చేసిన ప్రత్యేక ప్రాంతాలు.అరుదైన భూమి ఖనిజాలతో తయారు చేయబడిన శాశ్వత అయస్కాంతాలు స్వచ్చమైన శక్తి, అధిక స్థాయి తయారీకి చాలా ముఖ్యమైనవి.
ఏపీలోనూ పుష్కలంగా..
దేశంలోనే అరుదైన ఖనిజ వనరులు కలిగిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇందులో మోనజైట్ అధికంగా ఉండే బీచ్ శాండ్ ఉంది. క్లీన్ మొబిలిటీ, టెక్నాలజీపై దృష్టి సారించిన భారత్.. ఈ కారిడార్ ద్వారా వ్యూహాత్మక దృష్టి సారించింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలో మీటర్ల పొడవైన తీరం ప్రాంతంలోని ఇసుకలో మోనోజైట్, రుట్లై, జిరోకాన్, గార్నెట్, ఇల్మెనైట్ వంటి అరుదైన మూలకాలు ఉన్నట్లు గుర్తించారు.