Nirmala Sitharaman
Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ వేళ వివిధ శాఖలకు కేటాయింపుల గురించి దేశమంతా చర్చించుకుంటుంటే.. ప్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టిసారించారు. గడిచిన ఎనిమిది బడ్జెట్ సెషన్లలో అంటే.. 2019 నుంచి 2025 వరకు నిర్మల సీతారామన్ ఒక్కో చీరను ధరించి ప్రత్యేకను చాటుకున్నారు.
పార్లమెంట్ లో ఆదివారం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి కూడా నిర్మలమ్మ తాను ధరించిన చీరతో అందరి దృష్టిని ఆకర్షించారు. చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టపడే నిర్మలా సీతారామన్ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. ప్రస్తుతం బడ్జెట్ వేళ నిర్మలాసీతారామన్ కాంజీవరం చీరలో కనిపించారు.
బంగారు, నలుపు వర్ణం అంచుతో ఉన్న మెరూన్ రంగు చీర, గోల్డెన్ కలర్ బ్లౌజ్, భుజంపై శాలువాతో కనిపించారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఆ రాష్ట్రం నేపథ్యం కలిగిన కాంజీవరం చీరలో కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ను సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.
ఏ ఏడాది ఏ చీర ధరించారంటే..?
2019 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ తొలిసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన మంగళగిరి చేనేత చీరను ధరించారు.
2020లో దక్షిణ భారతదేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచిపట్టు చీరను ధరించారు.
2021లో తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను ధరించారు.
2022లో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయ్ శైలి చీరను ధరించారు.
2023లో కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో నిర్మలా సీతారామన్ కనిపించారు.
2024 (మధ్యంతర బడ్జెట్) రోజున పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను నిర్మలా సీతారామన్ ధరించారు.
2024లో (పూర్తి స్థాయి బడ్జెట్) బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున నిర్మలా సీతారామన్ మంగళగిరి పట్టు చీరను ధరించారు.
2025 బడ్జెట్ సెషన్‌లో బిహార్‌కు చెందిన సుప్రసిద్ధ మధుజని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజాగా.. 2026 బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ కాంజీవరం చీరను ధరించారు.