Railway Employees Bonus : పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.17,951 బోనస్.. కేంద్రం కీలక ప్రకటన
Railway Employees Bonus: కేంద్ర ప్రభుత్వం 11.4 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన దీపావళి బోనస్ ప్రకటించింది.
- V Santhosh Kumar
- Updated on- October 14, 2026 / 05:58 PM IST
Union cabinet approves 78 day diwali bonus railway employees ashwini vaishnaw
Railway Employees Bonus: పండుగల వేళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్వహించిన సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అందులో భాగంగా దీపావళి, దసరా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని భారతీయ రైల్వే పరిధిలోని నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్ (PLB) ప్రకటించారు. ఈ ప్రతిపాదన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తున్న రైల్వే సిబ్బందికి ఈ బోనస్ దక్కనుండటం విశేషం.
రూ.2,009 కోట్ల నిధుల కేటాయింపు.. 11.4 లక్షల మందికి లబ్ధి:
కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో సుమారు 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 78 రోజుల జీతానికి సమానమైన బోనస్‌ను ప్రభుత్వం విడుదల చేయనుండగా, దీనికోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2,009 కోట్లు వ్యయం చేయనున్నారు. మనం కుటుంబాలతో పండుగలు జరుపుకుంటున్న వేళ.. ట్రాక్‌లు, వర్క్‌షాప్‌లు, రైలు ఇంజిన్లలో రాత్రింబవళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్న కష్టజీవులైన ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగానే ఈ పండుగ కానుకను ఇస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.
రూ.17,951 చెల్లింపులు.. వేతన పరిమితి పెంపుపై కార్మిక సంఘాల డిమాండ్:
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కనీస వేతనం రూ.7,000 ప్రాతిపదికగా లెక్కిస్తూ అర్హులైన ప్రతి ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 బోనస్‌గా అందనుంది. అయితే 2014-15 నుంచి ఈ కనీస పరిమితి లేకపోవడంతో, లెక్కింపు వేతనాన్ని రూ.18,000కు పెంచి ప్రతీ ఒక్కరికీ రూ.46,184 చొప్పున ఇవ్వాలని ఐఆర్టీఎస్ఏ (IRTSA) సహా పలు రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పండుగ వేళ ఈ బోనస్ ప్రకటనతో రైల్వే సిబ్బంది కుటుంబాల్లో పండుగ ఉత్సాహం రెట్టింపైంది.
