IMD Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు.. రానున్న 6 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 15 నుంచి 20 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు(IMD Rain Alert) కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ వెల్లడించింది.
Imd rain alert telangana andhra pradesh heavy rains next six days
IMD Rain Alert: గత కొద్ది రోజులుగా తీవ్రమైన భానుడి ప్రతాపం, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అక్టోబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ వరకు దాదాపు ఆరు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురిసి భానుడి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు:
తెలంగాణ వ్యాప్తంగా పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం నెలకొనగా, అక్టోబర్ 15న ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్ష (IMD Rain Alert)సూచన ఉంది. అక్టోబర్ 16, 17 తేదీల్లో పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎమ్డీ హెచ్చరించింది. అక్టోబర్ 18 నుంచి 20 వరకు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో యెల్లో అలర్ట్.. ఈదురుగాలులతో చల్లబడనున్న వాతావరణం:
ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 15న అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అక్టోబర్ 16, 17 తేదీల్లో రాయలసీమ పరిధిలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు వర్ష సూచనలతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నా, మత్స్యకారులకు సముద్రంలో వేటపై ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
