South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పండుగ వేళ ప్రత్యేక రైళ్లు.. భారీగా ఖాళీ బెర్తులు, జాబితా ఇదిగో!
పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఖాళీ బెర్తుల వివరాలను ప్రకటించింది.
South central railway announces special trains berth availability festival season
South Central Railway: వరుస పండుగలు, సెలవుల నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ రైళ్లలో (South Central Railway)కనీసం వెయిటింగ్ లిస్ట్ కూడా దొరకని పరిస్థితి నెలకొనడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ వివిధ ప్రధాన మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవడానికి వీలుగా చర్లపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ల నుంచి నడిచే పలు ప్రత్యేక రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలతో కూడిన అధికారిక పత్రికా ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.
ఢిల్లీ, బెంగళూరు, బిహార్ మార్గాల్లో వేలాది సీట్లు ఖాళీ:
చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే రైలు (07021/07023)తో పాటు SMVT బెంగళూరు (07065) ప్రత్యేక రైలులో అక్టోబర్, నవంబర్ నెలల్లో వందలాది బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఉత్తరాది, బిహార్ వెళ్లే వారి కోసం చర్లపల్లి-దానాపూర్ (07049), చర్లపల్లి-ససారం (07041) రైళ్లలో వివిధ తేదీల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ డెక్కన్-మంగళూరు సెంట్రల్ (07097) ప్రత్యేక రైలులోనూ అక్టోబర్ 28 నుంచి నవంబర్ నెలాఖరు వరకు సుమారు 500 పైగా బెర్తుల లభ్యత ఉందని రైల్వే ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల భక్తులు, ప్రయాణికులకు తీపి కబురు:
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం జల్నా-తిరుపతి (07814), నాందేడ్-తిరుచానూరు (07603) రైళ్లలో భారీగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే చర్లపల్లి-నరసాపురం (07063) మార్గంలో ప్రతీ వారం 400 పైగా బెర్తులు అందుబాటులో ఉండగా, రోజువారీ తిరిగే సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ (07711/07712) రైళ్లలోనూ సీట్లు లభిస్తున్నాయి. ఈ ఖాళీల సంఖ్య బుకింగ్స్ను బట్టి మారే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు వెంటనే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా కౌంటర్లలో టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
