యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై నిషేధం పొడిగింపు
- bheemraj
- Published On : December 30, 2020 / 12:02 PM IST
union government Extension of ban on flights from the UK to India : యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది. 2021 జనవరి 7వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది.
హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొత్తం 107 శాంపిళ్లను పరిశీలించారు. సీసీఎంబీలో పరిశీలించిన శాంపిళ్లలో ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, ఢిల్లీ తొమ్మిది, బెంగళూరులో ఏడు, హైదరాబాద్‌లో రెండు, కోల్‌కతాలో ఒకటి, పూణెలో ఒకటి, కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కొత్త స్ట్రెయిన్ సోకిన వారిని ప్రత్యేక గదుల్లో ఐసొలేషన్‌లో ఉంచారు వైద్యులు. బాధితుల కాంటాక్టులు గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
కొత్త స్ట్రెయిన్ సోకిన వారిలో మీరట్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తల్లిదండ్రులతో కలిసి ఇటీవల బ్రిటన్ నుంచి మీరట్ వచ్చిన ఓ చిన్నారికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారించారు. వారి తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ..వారికి కొత్త స్ట్రెయిన్ సోకలేదు.
